Asianet News TeluguAsianet News Telugu

అన్నదాతలకు అండగా... నేరుగా వారి ఖాతాల్లోకే రూ.1,252 కోట్లు: సీఎం జగన్ చేతులమీదుగా

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీమా సొమ్మును ఆయా కర్షకుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 

AP CM YS Jagan Distributes Crop Insurance To Farmers
Author
Amaravathi, First Published Dec 15, 2020, 1:50 PM IST

అమరావతి : ప్రభుత్వం అన్నదాతలకు భరోసా కల్పించేందుకు వైఎస్సార్‌ పంట బీమా పథకాన్ని తీసువచ్చింది. వాతావరణ పరిస్థితులతో సక్రమంగా దిగుబడి పొందలేని రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియకు ఇవాళ(మంగళవారం) శ్రీకారం చుట్టింది. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీమా సొమ్మును ఆయా కర్షకుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీంతో 2019 సీజన్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు రూ.1,252 కోట్ల బీమా పరిహారం దక్కనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్‌ బటన్‌నొక్కి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమచేశారు. 

గతంలో చంద్రబాబు సర్కార్‌ ఎప్పుడూ పంటలు కోల్పోయిన రైతులకు సకాలంలో బీమా సొమ్ము చెల్లించలేదని వైసిపి శ్రేణులు పేర్కొన్నాయి. పైగా రైతులపై ప్రీమియం పేరుతో వందల కోట్ల రూపాయల భారం మోపిందన్నారు. దీంతో రైతులు బీమా సౌకర్యం పొందలేకపోయారన్నారు. రైతన్నల బాధకు చలించిపోయిన సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడకుండా... ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరించేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. 

రైతుల తరఫున బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నారు. 2019 సీజన్‌లో పంట నష్టానికి ఏడాది తిరగకముందే బీమా పరిహారాన్ని రైతుల ఖాతాలకు జమ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

పారదర్శకతకు పెద్దపీట : ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేసి బీమా సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే ఏర్పాటు చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ రైతులు స్వయంగా పరిశీలించుకునేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాల్లో ఈ–క్రాప్‌ వివరాలతో సహా లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు. 2019–20లో 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు పంటల బీమాను వర్తింప చేసింది. ఇందుకోసం రైతులు చెల్లించాల్సిన రూ.468 కోట్ల ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరిస్తూ మొత్తం రూ.971.23 కోట్లు చెల్లించింది.

Follow Us:
Download App:
  • android
  • ios