Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని నిర్ణయం.. ఏపీలో ప్రతిపక్షాల చేతికి కొత్త ఆయుధం, ఇరకాటంలో జగన్ సర్కార్

యెంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లు ప్రధాని మోడీ నిర్ణయంతో ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పడ్డారు. సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్ఈ) 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని తీసుకున్న నిర్ణయమే ఈ పరిస్ధితికి కారణం.. 

ap cm ys jagan dilemma in 10th and inter exams ksp
Author
Amaravathi, First Published Jun 3, 2021, 2:56 PM IST

యెంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లు ప్రధాని మోడీ నిర్ణయంతో ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పడ్డారు. సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్ఈ) 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని తీసుకున్న నిర్ణయమే ఈ పరిస్ధితికి కారణం.. 

కరోనా సెకెండ్‌ వేవ్‌ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన జరిగిన కీలక భేటీలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వివిధ భాగస్వాముల నుంచి సేకరించిన అభిప్రాయాలు కూడా పరీక్షల రద్దుకు ఒక కారణమని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ప్ర‌క‌టించింది. బోర్డు పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్య, పాఠశాల విద్య కార్యదర్శులు, విద్యాశాఖకు చెందిన ఇతర అధికారులతో ప్రధాని మోడీ స‌మావేశ‌ మ‌య్యారు. అనేక అంశాల‌పై చ‌ర్చించిన అనంతరం సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల ర‌ద్దుకే ప్ర‌ధాని మొగ్గు చూపారు. అయితే విద్యార్థుల‌కు మ‌రో ఆప్ష‌న్ కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చింది.

మార్కుల విషయంలో అసంతృప్తిగా ఉండే విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని.. అయితే, కరోనా పరిస్థితులు మెరుగయ్యాకే పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం స్ప‌ష్టం చేసింది. ప‌రీక్ష‌ల ర‌ద్దు నిర్ణ‌యం అనంత‌రం ప్ర‌ధాని మోడీ చేసిన ట్వీట్‌ను ఒకసారి పరిశీలిస్తే.. ‘కొవిడ్‌ 19తో విద్యా సంవత్సరం తీవ్రంగా ప్రభావితమైంది. బోర్డు పరీక్షల అంశం విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల్లో తీవ్ర ఒత్తిడికి కారణమవుతోంది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, వారి భద్రతే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యం. అందుకే పరీక్షలను రద్దు చేశాం’ అని ప్ర‌ధాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read:సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు.. విద్యార్ధుల ఆరోగ్యమే ముఖ్యం: మోడీ

అయితే క‌రోనా సెకెండ్ వేవ్ నేప‌థ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాప‌కుల ఆరోగ్యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లను ర‌ద్దు చేయాల‌ని ఉపాధ్యాయ సంఘాలు, ప్ర‌తిప‌క్షాలు, విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వ‌స్తున్నాయి. అయితే ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కే జ‌గ‌న్ స‌ర్కార్ మొగ్గు చూపుతోంది. దీనిలో భాగంగా ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్‌ను వాయిదా వేస్తూ... క‌రోనా పరిస్థితులు చక్కబడగానే నిర్వ‌హిస్తామ‌ని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌నే ర‌ద్దు చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డంతో స‌హ‌జంగానే జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఒత్తిడి పెరుగుతోంది. విద్యార్థుల ఆరోగ్యం ఏపీ స‌ర్కార్‌కు ప‌ట్ట‌దా అంటూ విమర్శలు వస్తున్నాయి.

సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌నే కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన‌ప్పుడు, జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎందుకంత ప‌ట్టింపు అని మండిపడుతున్నారు. టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి తీరుతామ‌ని ఇంకా మొండి ప‌ట్టుద‌ల‌తో ముందుకెళుతుందా లేక కేంద్ర ప్ర‌భుత్వ స్ఫూర్తితో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటుందా? అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి. మొత్తం మీద కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం మాత్రం జ‌గ‌న్ స‌ర్కార్‌ను ఇర‌కాటంలో ప‌డేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు జగన్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరికొద్దిరోజుల్లో కొత్త విద్యాసంవత్సరం కూడా ప్రారంభంకానుండటంతో... ఇప్పుడు పరీక్షల నిర్వహణ నిర్ణయం సరైనదేనా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. 
 

Follow Us:
Download App:
  • android
  • ios