ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి రేపటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్యనేతల అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతో సీఎం పర్యటన వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. బీజేపీ అగ్రనేత, హోంమంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఖరారైన తర్వాత వారం రోజుల్లో జగన్‌ ఢిల్లీ వెళ్లే అవకాశమున్నట్టుగా సమాచారం.  

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 7న సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లాల్సి వుంది. పోలవరం ప్రాజెక్ట్, విభజన సమస్యలు, వ్యాక్సిన్ మీద కేంద్ర మంత్రుల్ని జగన్ కలిసే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల సీఎంలు జగన్ లేఖ రాయడంతో ఢిల్లీ టూర్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యాక్సిన్ విషయంలో గ్లోబల్ టెండర్లపై సీఎం జగన్ అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. ఏపీ సహా 9 రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా.. ఒక్క బిడ్ కూడా రాలేదని పేర్కొన్నారు.

Also Read:సీఎంలకు లేఖ.. ప్రధానిని ముందు ఈ ప్రశ్నల్ని అడగండి: జగన్‌పై జైరాం రమేశ్ వ్యాఖ్యలు

‘గ్లోబల్ టెండర్ల’ పేరిట హడావుడి చేసి, చివరికి ఎలాంటి స్పందనా రాని నేపథ్యంలో జగన్ లేఖలు రాశారు. ‘నా అనుభవంతో చెబుతున్నాను. వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలుగా మనం ఏమీ చెయ్యలేం. చాలా సవాళ్లు ఉన్నాయి. విషయం కేంద్రానికే వదిలేద్దాం’ అని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. పలురాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసినప్పటికీ.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు రాసిన లేఖ మాత్రం బయటికి వచ్చింది.