ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, కొడాలి నాని భేటీ అయ్యారు. ఇందాక కొద్దిసేపటి కింద తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన భేటీ కొనసాగుతుంది. 

సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దవ్వగానే మంత్రులు ఆయన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అరగంట నుంచి జరుగుతున్న ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టు తీర్పులతో పాటు ఎన్నికల కమిషనర్, ఢిల్లీ టూర్ రద్దు వ్యవహారంపై కూడా కీలక చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం కొడాలి నాని లేదా విజయసాయి మీడియా మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం కనబడుతుంది. 

షెడ్యూల్ ప్రకారం, ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. మొదట కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో భేటీ కావాల్సి ఉంది. అయితే.. సడన్‌గా పర్యటన ఎందుకు వాయిదా పడింది అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

పర్యటన రద్దు కాకపోయి ఉంటే.. జగన్ పర్యటన ఇలా సాగేది..

మంగళవారం ఉదయం 10.30కి గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయల్దేరి.. ఒంటిగంటకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంది. అక్కడి నుంచి నేరుగా జన్‌పథ్‌-1లోని తన నివాసానికి వెళ్తారని.. అనంతరం హోం మంత్రి అమిత్‌ షాతో పాటు ఆర్థిక, జలశక్తి మంత్రులు నిర్మలా సీతారామన్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తదితరులను కూడా ఆయన కలుస్తారని నిన్నట్నుంచి వార్తలు వస్తున్నాయి.

ఈ వరుస భేటీల్లో భాగంగా రాష్ట్రానికి సాయం అందించాల్సిందిగా అభ్యర్థిస్తారని, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరతారని అధికార వర్గాలు సోమవారం నాడు మీడియాకు వెల్లడించారు. వీటితో పాటు ముఖ్యమంత్రిగా ఏడాది పాలనలో తీసుకునే అనేక నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టడం.. వాటికి సంబంధించి జగన్‌ తమ వైఖరిని అమిత్‌షాకు వివరించే అవకాశమున్నట్లు కూడా నిన్నట్నుంచి వార్తలు వినిపించాయి. మరీ ముఖ్యంగా శాసన మండలి రద్దుకు సహకరించాలని కేంద్రాన్ని కోరతారని కూడా వార్తలొచ్చాయ్.