అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై, ఇళ్ల పట్టాల పంపిణీపై ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. 

ఉగాది పర్వదినం రోజు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా వేశారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి కావడంతో ఆ రోజును ఆయన ఇళ్ల పట్టాల పంపిణీకి ఎంపిక చేశారు 

Also Read: ఏపీలో మూడు కరోనా వైరస్ కేసుల నమోదు, ప్రభుత్వం అప్రమత్తం

జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. కరోనాపై ఆందోళన చెందవద్దని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంచి అపోహలు తొలగించాలని ఆయన సూచించారు. 

సరుకుల కొరత వస్తుందన్న అనుమానాలు పెట్టుకోవద్దని కూడా ఆయన చెప్పారు. దుకాణాలు అందుబాటులో ఉంటాయని, దుకాణాలను మూసివేయడం లేదని ఆయన చెప్పారు. నిత్యావసర సరకులకు కొరత ఉండదని చెప్పారు. 

నిజానికి, ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈసీ నిలిపేయాలని సూచించింది. అయితే, ఎన్నికలను ఆరు వారాల పాటు ఈసీ రమేష్ కుమార్ వాయిదా వేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కోడ్ వర్తిస్తుందని చెప్పారు. అయితే, అమలులో ఉన్న కార్యక్రమాలను అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

దీంతో ఉగాదికి ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అనుకోకుండా కరోనా వైరస్ ప్రమాదం వాటిల్లడంతో ఇళ్ల పట్టాల పంపిణీని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీరు ముగ్గురు కూడా విదేశాల నుంచి వచ్చినవారే.