ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు శస్త్రచికిత్స: సీఎం జగన్ పరామర్శ
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఇవాళ పరామర్శించారు. మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ ను సీఎం ఇవాళ పరామర్శించారు.
అమరావతి:ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అపెండిసైటిస్ రోబోటిక్ సర్జరీ పూర్తైంది. మంగళవారంనాడు తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ నజీర్ ను పరామర్శించారు.
గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని ఏపీ సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు.రెండు రోజుల తిరుపతి పర్యటన ముగించుకుని ఇవాళ సాయంత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి సీఎం జగన్ మణిపాల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురి కావడంతో నిన్న ఆయనను మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. గవర్నర్ ను పరీక్షించిన వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. వెంటనే ఆయనకు శస్త్రచికిత్స కూడ నిర్వహించారు. మణిపాల్ ఆసుపత్రిలోనే గవర్నర్ ఉన్నారు. గవర్నర్ ఆసుపత్రిలో ఉన్న విషయం తెలుసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మణిపాల్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఏపీ గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణం చేశారు. ఏపీ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో అబ్దుల్ నజీర్ ను నియమించారు. సుప్రీంకోర్టు జస్టిస్ గా పనిచేసిన అబ్దుల్ నజీర్ రిటైరయ్యారు. రిటైరైన తర్వాత నజీర్ ను ఏపీ గవర్నర్ గా నియమించారు. సుప్రీంకోర్టు జడ్జిగా పలు కీలక తీర్పులను నజీర్ ఇచ్చిన విషయం తెలిసిందే.