అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోతో పాటు తాను పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలుపై జగన్ ముందుకు వెళుతున్నారు.

అయితే సార్వత్రిక ఎన్నికలు ముగిస.. స్థానిక సమరానికి సమయం ముంచుకొస్తున్న తరుణంలో ముఖ్యమంత్రికి కొత్త చిక్కొక్కటి వచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలను ముందుగా ఏర్పాటు చేయాలా లేక స్థానిక ఎన్నికలను ముందుగా నిర్వహించాలా అనే దానిపై తేల్చుకోలేకే జగన్ మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది.

ముందు ఎన్నికలు జరిపి.. ఆ తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని ఏర్పాటు చేసే కొత్త జిల్లాల పాలనలో అనేక సమస్యలు తలెత్తుతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగని.. ఎన్నికలను వాయిదా వేద్దామంటే.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎంత లేదన్నా ఆరు నెలలకు పైగానే పట్టొచ్చు.

మండలపరిషత్‌, జిల్లా పరిషత్‌లకు గడువు జూలైకు పూర్తవుతుంది. మొదట పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండలపరిషత్‌, జిల్లా పరిషత్‌, అనంతరం మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని కొత్త ప్రభుత్వం భావించింది.

ఈ మేరకు మేరకు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అధికారులు ఇప్పటికే పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. అయితే రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 50 శాతానికి పరిమితం చేయాల్సి ఉంది.

పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విషయంలో ఎలాంటి ఇబ్బందుల్లేవు. మండలపరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలతోనే సమస్యలంతా. జిల్లాల ఏర్పాటు పూర్తికాకుండా పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తే పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎలా కాదనుకున్నా కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం వుంది. దీంతో ఎన్నికలు వాయిదా వేయడమా లేక కొత్త జిల్లాల ఆలోచన ప్రస్తుతానికి విరమించుకోవడమా అనేది తేలాల్సి వుంది.

మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైసీపీ.. ఆ ఊపులోనే స్థానిక ఎన్నికలు నిర్వహించి స్థానిక సంస్థలన్నీ తన ఖాతాలోకి వేసుకోవాలని ఉర్రూతలూగుతోంది. ఈ మేరకు సీఎం జగన్‌ ఇప్పటికే పార్టీ కేడర్‌ను సమాయత్తం చేశారు.