మన రాష్ట్ర జనాభాలో 2.12 కోట్ల మంది కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతపురంలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి సమస్యలను పట్టించుకోకపోతే చూపునే కోల్పోయే పరిస్ధితి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కంటి శుక్లాలు, చిన్నపాటి చికిత్సతో నయం చేస్తే చూపును మెరుగు పరచుకోవచ్చునన్నారు.

కంటి చూపుకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టనప్పటికీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కోసం రూ.560 కోట్ల రూపాయలను కేటాయించామని సీఎం వెల్లడించారు.

ఈ పరీక్షలు చేయించిన తర్వాత ఉచితంగా కళ్లజోళ్లు ఇస్తామన్నారు. మూడేళ్లకాలంలో ఆరుదశల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని సీఎం వెల్లడించారు. 5.4 కోట్ల మంది ప్రజలకు ఒకేసారి కంటి పరీక్షలు, చికిత్సలు సాధ్యం కాదు కాబట్టి.. పిల్లలకు ముందుగా చికిత్స చేయిస్తామని జగన్ వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62,489 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని 70 లక్షల 41 వేల 988 మంది బడిపిల్లలకు ఈ కార్యక్రమంలో ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తామన్నారు. అక్టోబర్ 10 నుంచి 16 వరకు మొదటి దశ.. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రెండో దశ కార్యక్రమం జరుగుతుందన్నారు.

గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రాల సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థలను ఈ పథకంలో భాగస్వామ్యులను చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో వైద్య, ఆరోగ్య శాఖలో మార్పులకు శ్రీకారం చుట్టామని.. 108 వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని జగన్ వెల్లడించారు.

432 108 కొత్త వాహనాలను, 102 సేవల కోసం 676 కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. పలాస, మార్కాపురం ప్రాంతాల్లో కిడ్నీ బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారని ఈ రెండు చోట్లా కిడ్నీ చికిత్సా పరిశోధనా కేంద్రం, ఆసుపత్రులన ఏర్పాటు చేస్తామని జగన్ తెలిపారు.

మార్కాపురం, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరు, విజయనగరం, ఏలూరు, పులివెందులలో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని పరీక్షించి డిసెంబర్‌లో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తామన్నారు.

ఇందులో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు, వ్యాధులకు సంబంధించిన స్టోరేజ్ ఉంటుందని జగన్ వెల్లడించారు. రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేశామని, 1200 వ్యాధులకు ఉచిత వైద్యసేవలు అందిస్తామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ముందుగా పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తామని అనంతరం ప్రతిజిల్లాను చేరుస్తామన్నారు.