కరోనా బారినపడి, తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం భూమనకు ఫోన్ చేసిన జగన్ ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.

తాను క్షేమంగానే ఉన్నానని ముఖ్యమంత్రికి వివరించారు. భూమన త్వరగా కోలుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. వైసీపీలో ఒకరి వెంట ఒకరు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లాలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో సీఎం పర్యటించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న నేతలు, మీడియా సిబ్బందికి అధికారులు కోవిడ్ టెస్టులు నిర్వహించారు. 

Also Read:ఏపీలో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న కరోనా: కొత్తగా 10,603 కేసులు, 88 మరణాలు

ఈ క్రమంలో అవినాశ్ రెడ్డికి పాజిటివ్‌గా తేలడంతో ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఇదే సమయంలో అవినాశ్‌తో కొద్దిరోజులుగా సన్నిహితంగా ఉంటున్న వారిలో ఆందోళన నెలకొంది. ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు నేతలు కరోనా బారినపడ్డారు.

ఆదివారం కూడా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. అయితే కరోనా లక్షణాలు లేకపోవడంతో ప్రస్తుతానికి ఆయన హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.