విశాఖపట్నం: అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్ వేడుకలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. న్యూఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకున్న సీఎం జగన్ సాయిప్రియ రిసార్ట్స్ కు చేరుకున్నారు. 

వధూవరులు ఎంపీ మాధవి, శివప్రసాద్ లను సీఎం జగన్ ఆశీర్వదించారు. నూతన దంపతులు జగన్ కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులతో సీఎం జగన్ ప్రత్యేకంగా ముచ్చటించారు. 

సీఎం జగన్ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్ కు హాజరవుతున్నారని తెలుసుకోవడంతో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతీ ఒక్కరిని సీఎం జగన్ ఆప్యాయంగా పలుకరించారు. నేతల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.  

ఎంపీ మాధవి వివాహ రిసెప్షన్ లో సెల్ ఫోన్లకు పనిచెప్పారు. సీఎం జగన్ తో సెల్ఫీలు దిగేందుకు రాజకీయ నాయకుల దగ్గర నుంచి వివాహానికి హాజరైన బంధువులు అంతా పోటీపడ్డారు. ఒకానొక దశలో ఎంపీ మాధవి భర్త సైతం జగన్ తో సెల్ఫీ దిగారు. 

రిసెప్షన్ వేడుకల్లో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి జంట సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పుష్పశ్రీవాణితో ఫోటోలు దిగేందుకు మహిళలు, యువతులు పోటీ పడ్డారు. రిసెప్షన్ కు అతిథిలా కాకుండా దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు పుష్పశ్రీవాణి. 

రిసెప్షన్‌కు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, ఎంపీలు వెంకట సత్యవతి, వంగా గీత, గోరంట్ల మాధవ్, డా.సంజీవ్‌కుమార్, చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు ముత్యాలనాయుడు, చెట్టి ఫాల్గుణ, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. 

జగన్ తో దాడి వీరభద్రరావు భేటీ
విశాఖపట్నం చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో వైసీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలపై చర్చించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సాయిప్రియ రిసార్ట్స్ వరకు జగన్ తోనే కారులో వచ్చారు. 

జిల్లాలోని పార్టీ పరిస్థితి, జిల్లా సమస్యలను జగన్ కు ఏకరువు పెట్టుకున్నారు. ఇకపోతే విశాఖ నగరంలో రోజురోజుకీ కాలుష్యం పెరిగిపోతోందని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు పాతబస్తీకే పరిమితమైన కాలుష్యం ఇప్పుడు ఎంవీపీ కాలనీ వరకు విస్తరించిందని తెిపారు. 

కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం చొరవ చూపాలని సీఎం జగన్ ను కోరారు. దాడి చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం జగన్‌ వెంటనే కలెక్టర్‌ వినయ్‌చంద్‌తో మాట్లాడి కాలుష్యాన్ని అరికట్టాలని ఆదేశించారు. అనంతరం పథకాల అమలుపై సీఎం జగన్‌ దాడి వీరభద్రరావుని అడిగి తెలుసుకున్నారు. 

దేశంలోని  ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదనీ, తన రాజకీయ అనుభవంలో ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వాన్ని కూడా చూడలేదని దాడి వీరభద్రరావు స్పష్టం చేశారు. 

గతంలో కొన్ని వర్గాల ప్రజలకే మేలు జరిగేదనీ, కానీ ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలూ జీవితాంతం చెప్పుకునేలా పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజలందరి నుంచీ మంచి స్పందన వస్తోందని సీఎం జగన్ కు వివరించారు. 

రైతు భరోసా పథకం గురించి రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందని సీఎం జగన్ ఆరా తీశారు. లక్షలాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో అన్నదాతల్లో ఎనలేని సంతోషం కనిపిస్తోందనీ దాడి వీరభద్రరావు వివరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వైసీపీ మహిళా ఎంపీ వీడియో: ప్రేమికుడితో కలిసి...(వీడియో) 

పెళ్లి పీటలెక్కనున్న వైసీపీ మహిళా ఎంపీ