అరకు: వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ పెళ్లిపీటలెక్కనున్నారు. ఈనెల 17న అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నారు. ఇంతకీ పెళ్లిపీటలెక్కుతున్న ఆ ఎంపీ ఎవరనుకుంటున్నారా....? ఇంకెవరు అతిపిన్న వయస్సులోనే పార్లమెంట్ కు ఎన్నికై రికార్డు సృష్టించిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి. 

 

25ఏళ్ల వయస్సులో ఎంపీగా గెలిచి దేశవ్యాప్తంగా ఆకట్టుకున్నారు. లోక్ సభకు ఎంపికైన అతిచిన్న ఎంపీలలో మాధవి ఒకరుగా రికార్డు నెలకొల్పారు. అయితే ఎంపీ గొడ్డేటి మాధవి ఈనెల 17న గొలుగొండ మండలం కృష్ణాదేవి పేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్ తో వివాహం జరగనుంది. 

ఎంపీ మాధవి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె సోదరులు మహేశ్, ప్రసాద్ స్పష్టం చేశారు. ఈనెల 17న తెల్లవారు జామున 3.15గంటలకు శరభన్నపాలెంలో వివాహం జరగనుందని స్పష్టం చేశారు. వివాహం అనంతరం విశాఖపట్నంలో అదేరోజు రిసెప్షన్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. 

గొడ్డేటి మాధవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించారు. అయితే గత ఎన్నికల్లో అరకు లోక్ సభకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న రాజకీయ ఉద్దండుడుని ఓడించి చరిత్ర సృష్టించారు మాధవి.