రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.18 వేల నుంచి రూ.21 వేలకు పెరగనున్నాయి.
రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికుల వేతనాలు పెంచేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.18 వేల నుంచి రూ.21 వేలకు పెరగనున్నాయి. అలాగే ఆక్యూపేషన్ అలవెన్స్ కింద రూ.6 వేలు యథాతథంగా ఇస్తామని.. ఈ రూ.6 వేల అలవెన్స్‌తో కలిపి రూ.21 వేల వేతనం చెల్లిస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
మున్సిపల్ శాఖలో పారిశుద్ద్య కార్మికుల డిమాండ్లపై సీఎంతో చర్చించామని మంత్రి తెలిపారు. పారిశుద్ద్య కార్మికులకు హెల్త్ అలవెన్సు 6వేలు అలాగే ఉంచాలని సీఎం నిర్ణయించారని సురేష్ వెల్లడించారు. జీవో నెంబర్ 233ద్వారా ఇస్తున్న హెల్త్ అలవెన్సులు యథాతథంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని సురేష్ పేర్కొన్నారు. ప్రధాన డిమాండ్ పరిష్కరించిన దృష్ట్యా కార్మికులు సమ్మె విరమించాలని కోరుతున్నామని... రేపటి నుంచి విధులకు హాజరు కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
