రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు పంట, ఆస్తినష్టంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరదలు, వర్షాల కారణంగా చనిపోయిన వారికి కుటుంబాలకు సీఎం ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు అందజేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పంట, ఆస్తినష్టంపై అంచనా నివేదిక త్వరగా పంపాలని అధికారులను ఆదేశించారు. 

కాగా, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్ర తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ(మంగళవారం) రాయలసీమలో, రేపు(బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రకటించారు.

ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తుండగా... తాజాగా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  

Also Read:ఉపరితల ఆవర్తనం... నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమయ్యింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మరికాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుత ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 3,52,579 వుండగా అవుట్ ఫ్లో 3,43,690 క్యూసెక్కులుగా వుంది. 

ఈ నేపథ్యంలోనే వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేశారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు.

ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని... వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం  లాంటివి చేయరాదని విపత్తుల శాఖ కమిషనర్ హెచ్చరించారు.