విశాఖపట్టణం: జిల్లాలోని గాజువాకలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్ధిని వరలక్ష్మి కుటుంబానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

గాజువాకలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో శనివారం నాడు రాత్రి  తొమ్మిదిన్నర గంటల సమయంలో ఇంటర్ విద్యార్ధిని వరలక్ష్మిని  అఖిల్ సాయి అనే యువకుడు కత్తితో పొడిచి చంపాడు.

మహిళల భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని డీజీపీ, సీఎస్ లను జగన్  ఆదేశించారు. విద్యార్ధినులంతా దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకొనే విధంగా అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరితకు ఆదివారం నాడు ఉదయం ఫోన్ చేశారు. మంత్రితో పాటు సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్  నుండి సీఎం వివరాలను తెప్పించుకొన్నారు.

వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రిని సీఎం ఆదేశించారు. అంతేకాదు దిశ ప్రత్యేక అధికారులు కృతి శుక్లా, దీపికా పాటిల్ లు కూడ బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆయన కోరారు.

also read:విశాఖలో ప్రేమోన్మాదం... యువతిపై కత్తితో దాడి, నడిరోడ్డుపై దారుణ హత్య

మహిళలపై దాడులు, దౌర్జన్యాలు అరికట్టేందుకుగాను కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

తమకు ముప్పు ఉందని మహిళలు, విద్యార్ధినులు ఫిర్యాదు చేస్తే ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదని సీఎం కోరారు.  వరలక్ష్మిని చంపిన నిందితుడు అఖిల్ సాయి ఆంధ్రా యూనివర్శిటీలో బీఎల్ చదువుతున్నాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు.