విశాఖపట్నం: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతునే వున్నాయి. ప్రేమ పేరిట అమ్మాయిలను నిత్యం వేధించడమే కాదు ఒప్పుకోకుకుంటే ప్రాణాలను బలితీసుకుంటున్నారు కొందరు సైకోలు.  అలాంటి ఘటనే ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.  

విశాఖ నగరంలో నడిరోడ్డుపై ఓ యువతి గొంతు ను కత్తితో కోసి దారుణానికి ఒడిగట్టాడు ఓ యువకుడు.  గాజువాక సుందరయ్య కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరలక్ష్మి అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని సుందరయ్య కాలనీ సాయిబాబా గుడి వద్ద అఖిల్ అనే యువకుడు అడ్డగించాడు. ఈ క్రమంలోనే ఆమెతో కొద్దిసేపు కోపంగా మాట్లాడి తన వెంట తెచ్చుకున్న కత్తితో అందరూ చూస్తుండగానే గొంతుకోశాడు. తీవ్ర రక్త స్రావం అవడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. 

ఇలా వరలక్ష్మిపై దాడికి పాల్పడి ప్రాణాలను బలితీసుకున్న యువకుడు అఖిల్ గా గుర్తించారు.గత కొంత కాలంగా యువతిని ప్రేమ పేరుతో అతడు వేధిస్తున్నట్లు... ఇందుకు వరలక్ష్మి అంగీకరించకపోవడంతో కోపాన్ని పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.  

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిజిహెచ్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ఈ దారుణానికి పాల్పడిన యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ఘటన గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని విశాఖ పోలీసులు తెలిపారు.