వైసీపీ చీఫ్, సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ అగ్రశ్రేణి నాయకుడు ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో కాపులపట్ల ఆయన వ్యవహరిస్తున్న విధానం అబ్బురంగా ఉన్నదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. ఆయన కారణంగానే కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ కాపులను ప్రత్యేక గుర్తిస్తున్నదని వివరించారు.
అమరావతి: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి సంచలనానికి తెరలేపారు. ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డిపై ఆయన ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి కాపుల పట్ల అనుసరిస్తున్న తీరు చాలా బాగుందని పొగిడారు. కమలాపురం నియోజకవర్గంలో కాపులకు తమ పార్టీ ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి కారణం సీఎం వైఎస్ జగనే కారణమని అన్నారు.
రాష్ట్రంలో కాపులకు వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. అందుకే తమ పార్టీ టీడీపీ కూడా అనివార్యంగా వారికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలు అయిందని తెలిపారు. అందుకే వైఎస్సార్ జిల్లా కమలాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కాపు కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
ఇదిలా ఉండగా, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వరుసపెట్టి జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (raghu rama krishna raju) మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతి భద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 3 హత్యలు, 6 మానభంగాలు అని చెబుతుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లేని చట్టాల గురించి తమ పార్టీ నేతలు మాట్లాడతారంటూ రఘురామ చురకలు వేశారు. ఏపీలో ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో (national crime records bureau) వెల్లడిస్తోందని ఆయన దుయ్యబట్టారు.
మహిళలపై నేరాల్లో 2020లో ఏపీ 8 వ స్థానంలో ఉందన్న రఘురామ.. పని ప్రదేశాల్లో లైంగిక వేదింపుల ఘటనల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. అలాగే మహిళలపై భౌతిక దాడుల్లో మొదటి స్థానంలో ఉందని ... 2019తో పోలిస్తే.. రాష్ట్రంలో 63 శాతం మేర నేరాలు పెరిగాయని రఘురామ కృష్ణంరాజు వివరించారు. ప్రతి 3 గంటలకు ఎస్సీలపై ఓ దాడి జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో అత్యధిక లాకప్ డెత్‌లు ఏపీలోనే నమోదయ్యాయని, తన అదృష్టం బాగుండి పోలీసుల కస్టడీ నుంచి ప్రాణాలతో బయటపడ్డానంటూ వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు కల్పించలేని ప్రభుత్వం ప్రభుత్వమే కాదని జగన్ (ys jagan) పాలనపై రఘురామ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
