అమరావతి: చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదార్లకు బ్యాంకుల ద్వారా రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు ‘జగనన్న తోడు’పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారితో పాటు సంప్రదాయ చేతివృత్తుల కళాకారులయిన ఇత్తడి పని చేసే వాళ్లు, బొబ్బిలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీ, లేస్‌ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి వడ్డీ లేకుండా బ్యాంకుల ద్వారా రూ.10 వేల వరకు రుణాలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. తొలుత రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9.05 లక్షల లబ్ధిదారులకు రూ.905 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. 

క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ‘జగనన్న తోడు’ పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎం.శంకరనారాయణ, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్‌తో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, పలు బ్యాంకుల ప్రతినిధులు, పథకం లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఈ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... ఇవాళ ఒక మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నామన్నారు. తన 3648 కి.మీ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు స్వయంగా చూశానని... ఆ సమయంలోనే లక్షల సంఖ్యలో ఉన్న వారందరికి మంచి జరగాలని మనసారా కోరుకున్నానన్నారు.  ఈరోజు దేవుడి దయ, మీ చల్లని ఆశీర్వాదంతో ఒక మంచి కార్యక్రమం చేయగలిగే అవకాశం వచ్చిందన్నారు. 

read more  నివర్ తుఫాన్: అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జగన్ ఆదేశం

''పల్లె నుంచి పట్టణాల వరకు వీధుల్లో చిరు వ్యాపారంతో జీవిస్తున్న లక్షల మంది అక్క చెల్లెమ్మలు, లక్షల మంది అన్నదమ్ముల కోసం మనందరి ప్రభుత్వం ఇవాళ్టి నుంచి జగనన్న తోడు ప్రారంభిస్తోందని... అయితే వారిని చిరు వ్యాపారులు అనడం కంటే, ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలందిస్తున్నారని చెప్పాలి. ప్రతి రోజు వారి జీవితాలు తెల్లవారుజామున 4 గంటలకే మొదలవుతాయి. బండ్లపై టిఫిన్లు అమ్మాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఉదయం 4 గంటలకే వారి పని ప్రారంభమవుతుంది'' అన్నారు. 

''తోపుడు బండ్లపై తిను బండారాలు, కూరగాయలు, వస్తువులు అమ్మేవారు, ఎండ, వాన, చలిలో కూడా వీధుల్లో బండ్ల మీద టిఫిన్లు అమ్మే వారు కానీ లేకపోతే, కూరగాయలు, వస్తువులు అమ్మే వారు లేకపోతే చాలా మందికి గ్రామాల్లో కడుపు నిండదు. ఇంటి ముందే సరుకులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. వారి బతుకుబండి మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థ కూడా నడవదు. వారు చిరు వ్యాపారులు కాబట్టి, ఆదాయం అంతంత మాత్రమే. కానీ శ్రమ మాత్రం చాలా ఉంటుంది. వారికి రుణాలు కూడా అందవు. దీంతో వారు రూ.3, రూ.4 నుంచి రూ.10 వరకు వడ్డీతో పెట్టుబడి తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. వారంతా స్వయం ఉపాధి పొందడమే కాకుండా, వీలుంటే మరి కొందరికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు'' అని పేర్కొన్నారు. 

''వస్తువులు తెచ్చుకునేటప్పుడు ఆటోల వంటి వారికి పని కూడా కల్పిస్తున్నారు. అదే విధంగా సరుకులు తెచ్చుకునేటప్పుడు బరువులు దింపే కూలీలకు కూడా పని ఇస్తున్నారు. అలా వారు మన సమాజానికి మేలు చేస్తున్న మహానుభావులు'' అని చిరు వ్యాపారులను కొనియాడారు. 

''అయితే చిరు వ్యాపారులు అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారు కావడంతో బ్యాంకుల నుంచి రుణాలు రాక, ప్రైవేటు రంగంపైనే ఆధారపడాల్సి వచ్చింది. వారు చేసే వృత్తికి తక్కువ వడ్డీతో రుణం కూడా వచ్చేది కాదు. దీంతో రూ.3, రూ.5 మొదలు సందర్భాన్ని బట్టి నూటికి రూ.10 వరకు వడ్డీతో వారు పెట్టుబడి తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. అందుకే వారి జీవితాల్లో మార్పులు తీసుకురావాలని, వారికి తోడుగా నిలబడాలని, ఒక అన్నగా, తమ్ముడిగా అండగా ఉండాలని, చేయూతనివ్వాలని ఎప్పుడూ అనుకునే వాణ్ని. ఇవాళ ఆ పని చేస్తున్నాను'' అన్నారు. 

''జగనన్న తోడు అనే పథకంలో వారికి తోడుగా నిలవగలుగుతున్నాను. గతానికి, ఇప్పుడు తేడా చూస్తే.. గతంలో వారికి తోడుగా ఎవరూ నిలబడలేదు. కానీ ఇవాళ గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు ఎంతో తోడుగా నిలబడుతున్నారు. వారి దరఖాస్తు తీసుకోవడం మొదలు అన్ని రకాల సేవలందిస్తున్నారు. సచివాలయాల్లోని సంక్షేమ సహాయకులు ఎంతో సేవ చేస్తున్నారు. వారి దరఖాస్తులు పంపడంతో పాటు, జిల్లా అధికారులతో మాట్లాడడం, బ్యాంకర్లతో కూడా మాట్లాడుతున్నారు. పూర్తి పారదర్శకంగా పని చేస్తున్నారు. వారి తరపున ప్రభుత్వం నిలబడి, ఆ రుణాలపై ప్రభుత్వమే వడ్డీ కడుతుంది అన్న నమ్మకం కలిగిస్తున్నారు'' అని సీఎం జగన్ వెళ్లడించారు.