అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ పై అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.తుఫాన్ పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

also read:దూసుకొస్తున్న నివర్ తుఫాను: ఏపీ దక్షిణ కోస్తాకు ముప్పు

తుఫాను ప్రభావం ఏపీ రాష్ట్రంలో ఉంటుందని ఆయన చెప్పారు. ఏపీని తుఫాన్ తాకకపోయినా దాని ప్రభావం ఉంటుందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను కోరారు.

తుఫాన్ ప్రభావం ఈ నెల 26వ తేదీ వరకు ఉంటుందని ఆయన చెప్పారు.  తుఫాన్ ను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతాలు, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో 11 నుండి 20 సెం.మీ వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు.

65 నుండి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.  ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేసుకోవాల్సిందిగా కోరారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వర్షాలతో చెట్లు విరిగిపడితే  వాటిని వెంటనే తొలగించాలని ఆయన కోరారు.తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించే ప్రచార సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.