ఏపీ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి సచివాలయం పక్కన పనులు ఊపందుకున్నాయి. పాసులు, ఇన్విటేషన్ రెడీ అయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ (ap cabinet reshuffle) నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఉదయం నుంచి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో (sajjala rama krishna reddy) మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చించారు వైఎస్ జగన్ (ys jagan). రేపు మరోసారి సజ్జలతో జగన్ భేటీకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వీరి సమావేశం జరగనుంది. అవసరం, అనుభవం, సామాజిక కోణం , కొత్త, పాతల కలయికతో ఏపీ కొత్త కేబినెట్ రూపుదిద్దుకుంటుందని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. చివరి నిమిషం వరకు కేబినెట్ కూర్పుపై కసరత్తు కొనసాగుతుందన్నారు. బీసీలకు ప్రాధాన్యత పెంచే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలిపారు. మంత్రులందరీ రాజీనామాలు గవర్నర్ ఆమోదానికి వెళతాయన్నారు. మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ఎవరినీ బుజ్జగించాల్సిన పనిలేదని.. అందరూ జగన్ టీమే అన్నారు సజ్జల. 

అటు ప్రమాణ స్వీకారానికి (swearing in ceremony) సంబంధించి వేదిక. హై టీ కోసం విడి విడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అటు జీఏడీ కూడా పాస్‌లను సిద్దం చేసింది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛైర్మన్లు, అధికారులకు ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితులను ఏఏ, ఏ1, ఏ2, బీ1, బీ2 కేటగిరీలుగా విభజించి, పాసులు జారీ చేశారు. ఒక్కో పాసు ద్వారా ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి 35 నిమిషాల ముందే సీట్లలో ఆసీనులు కావాలని సూచించారు. 

ఈ రాత్రికి లేదంటే రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు (biswabhusan harichandan) రాజీనామా లేఖలు అందనున్నాయి. ఆ వెంటనే రాజీనామాలను ఆమోదించనున్నారు గవర్నర్. కొత్త మంత్రులపై సీఎం జగన్ కసరత్తు తుది దశకు చేరింది. కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకునేవారితో పాటు కొనసాగించే వారి పేర్లను కూడా గవర్నర్ వద్దకు పంపనుంది ప్రభుత్వం. సీల్డ్ కవర్‌లో కొత్త మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు చేరనుంది. ఏప్రిల్ 11వ తేదీన మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 

అంతకుముదు శుక్రవారం కూడా సీఎం జగన్‌తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సీఎం జగన్‌తో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ‌పై చర్చించలేదని సజ్జల తెలిపారు. సీఎం జగన్‌తో సమావేశం అనంతరం సజ్జల మాట్లాడుతూ.. సీఎంతో మంత్రి వర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఇతర అంశాలపై చర్చించామన్నారు. మంత్రి వర్గంలో ఎవరు ఉండాలనేది పూర్తిగా సీఎం నిర్ణయం అన్నారు. అందులో ఎవరి ప్రమేయం ఉండదని, విస్తరణపై కసరత్తు కొనసాగుతోందని సజ్జల అన్నారు.