Asianet News TeluguAsianet News Telugu

వైద్యశాఖ అధికారులతో సీఎం సమావేశం... కరోనా కట్టడికి కీలక ఆదేశాలు

రాష్ట్రంలో కోవిడ్‌–19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

AP CM Jagan Review Meeting on COVID19
Author
Amaravathi, First Published Jul 6, 2020, 10:08 PM IST

అమరావతి:  కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యమైన వైద్య సేవలందాలని, ఆ కేంద్రాలలో అన్ని సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. అలాగే క్వారంటైన్‌ కేంద్రాలలోనూ ఏ లోటూ ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. రోగుల సదుపాయాలు, వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో ఔషదాలు అందించే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చెప్పారు.

రాష్ట్రంలో కోవిడ్‌–19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

జిల్లాలలో ఏర్పాట్లు

కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించి రోగులకు వైద్య సేవలందించేందుకు అన్ని జిల్లాలలో కనీసం 3 వేల నుంచి 4 వేల బెడ్లు సిద్ధం చేశామని సమావేశంలో అధికారులు వెల్లడించారు. అయితే వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని, బెడ్లు, టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలని, రోజంతా వైద్య సేవలందేలా చూడాలని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాలతో కూడిన ఔషధాలు (మందులు) ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్దేశించారు.

ఇంటింటికీ వెళ్లి వివరాలు

కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా గుర్తించిన ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు ఆరా తీయాలని ముఖ్యమంత్రి కోరారు. ఇళ్లలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని, ఆ సమాచారాన్ని వైద్య అధికారులకు తెలియజేసి అవసరమైన పరీక్షలు చేయించాలని, చికిత్స అందించాలని సూచించారు.

అదే విధంగా కొంత మంది హోం క్వారంటైన్‌లో ఉంటున్నారని, కాబట్టి వారి ఇళ్లకు కూడా ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు వెళ్లి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవాలని...వారికి అవసరమైన పరీక్షలు చేసి, మందులు ఇవ్వాలని ఆదేశించారు. అంతే కాకుండా వారికి మనోధైర్యం కలిగించాలని, ప్రభుత్వం వారికి అండగా ఉందన్న ధీమా కల్పించాలని సీఎం సూచించారు.

ప్రజల్లో మరింత అవగాహన

కరోనాపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు (స్టిగ్మా) తొలగి పోయేలా వారికి మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేయడం, తగిన పరీక్షలు చేయించుకోవడం, ఇళ్లలోనే ఉండి చికిత్స పొందవచ్చన్న విషయాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం నిర్దేశించారు. అదే విధంగా గ్రామ సచివాలయాల్లో కూడా హోర్డింగ్‌లు ప్రదర్శించాలని, వాటిపై అన్ని ఫోన్‌ నెంబర్లు కూడా ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios