ఏపీ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం. గతంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినా కూడ కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.


రాష్ట్రంలోని సుమారు 29 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది.

ఈ ఏడాది ఉగాదికి (మార్చి 25)  లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని తొలుత నిర్ణయం తీసుకొంది. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

ఉగాదికి కాకుండా ఏప్రిల్ 14వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే అదే రోజున కాకుండా తన తండ్రి వైఎస్ఆర్ పుట్టిన రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నాడు. దీంతో ఏప్రిల్ 14వ తేదీ కాకుండా జూలై 8వ తేదీన  ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించింది.

అయితే ఇళ్ల పట్టాల విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆగష్టు 15వ తేదీకి రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది.

వైఎస్ఆర్ జయంతి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ జరగకుండా టీడీపీ అడ్డుకొందని వైసీపీ ఆరోపించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని తలపెట్టింది. కానీ ఆగష్టు 15వ తేదీన కూడ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది.

అయితే ఇళ్లపట్టాల పంపిణీని  ఎప్పుడు ప్రారంభించనున్నారో త్వరలోనే ప్రకటించనున్నట్టుగా ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు.