ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: జగన్
ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
అమరావతి:ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.కృష్ణా జిల్లా గొల్లపూడి సచివాలయంలో దిశ యాప్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. దిశ యాప్ ప్రతి ఒక్క మహిళకు ఒక్క సోదరుడిగా రక్షణ కల్పించనుందని సీఎం చెప్పారు. ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలన్నారు.
దిశ యాప్ కారణంగా మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని ఆయన చెప్పారు. సీతానగరం పుష్కరఘాట్ వద్ద యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన తనను కలిచివేసిందని సీఎం మరోసారి చెప్పారు.స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి మహిళ ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు. ఈ యాప్ పై ఇంటింటికి వెళ్లి అమగాహన కల్పించాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో కనీసం కోటికి పైగా యాప్ ను డౌన్ లోడ్ చేసుకొనేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులను స్వంతం చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొన్నారని సీఎం చెప్పారు.మహిళల భద్రతపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు అని ఆయన తెలిపారు.