కరోనాపై పోరాటం... ఏపి ఇండస్ట్రీస్ కోవిడ్ –19 రెస్పాన్స్ పోర్టల్ ను ఆవిష్కరించిన జగన్
కరోనాపై పోరాటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంంలోని వైసిపి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కరోనా మహమ్మారి నియంత్రణకు మరో ముందడుగు వేసింది. కోవిడ్ –19 మెడికల్ రిలేటెడ్ ఐటెంలు, మాస్క్‌లు, శానిటైజర్స్, బెడ్స్, బెడ్ రోల్స్ వంటి వైద్య పరమైన సామాగ్రి అమ్మేవారు, కొనేవాళ్ల సౌకర్యార్థం ఓ పోర్టల్ ను ఏర్పాటుచేసింది. ఏపి ఇండస్ట్రీస్ కోవిడ్ –19 రెస్పాన్స్ పోర్టల్ ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎంఎస్‌ఎంఈ కంపెనీలు, సరఫరాదారులు ఈ పోర్టల్‌లో తమ వివరాలు నమోదుచేసుకునే వెసులుబాటు వుంటుంది. దీని వల్ల ఎవరి దగ్గరి ఎలాంటి వైద్యపరమైన మరియు ఇతర సంబంధిత ఉత్పత్తులున్నాయన్న వివరాలతోపాటు అమ్మేవాళ్లు, కొనేవాళ్లను ఒకే ప్లాట్‌ఫాంపైకి వచ్చే వెసులుబాటు వుంటుంది. ఇది డెస్క్‌టాప్ లేదా మొబైల్ యాప్ ద్వారా అందరూ వాడుకోవచ్చని... అవసరమైన సామగ్రి కొనుగోలు చేసుకోడానికి సౌలభ్యంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
అంతేకాకుండా వైఎస్‌ఆర్ నిర్మాణ్ పోర్టల్స్‌ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పోలవరంతో వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణపనులు, ప్రభుత్వ గృహనిర్మాణంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులకు ఏ పరిమాణంలో సిమెంటు కావాలో ఈ వైయస్సార్ నిర్మాణ్ యాప్ ద్వారా ఇండెంట్ చేసుకునే వెసులుబాటు వుంది.
వివిధ సిమెంటు తయారీ కంపెనీలు మరియు వివిధ ప్రభుత్వ శాఖలకు నడుమ సమన్వయం చేయడమే ఈ యాప్ లక్ష్యమని అధికారులు తెలిపారు.తద్వారా వివిధ పనులు ఆలస్యం కాకుండా ముందుకు సాగడానికి ఆస్కారం వుండటమే కాదు ప్రభుత్వ ధనం ఆదా కానుంది.
సీఎఫ్‌ఎంఎస్‌కు వైయస్సార్ నిర్మాణ్ పోర్టల్‌ను అనుసంధానం చేయడం వల్ల సరఫరాదార్లకు ఎలాంటి ఆలస్యం లేకుండానే ఆన్‌లైన్ ద్వారా వారి పేమెంట్స్ చెల్లించే వెసులుబాటు ఉంటుందని అధికారులు వెల్లడించారు.