ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. దీనిలో భాగంగా నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.76 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఇందుకోసం 68,381 ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ వల్ల 17,005 కొత్త కాలనీలు ఏర్పడ్డాయని  జగన్ వివరించారు.

ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకు పైగా ఇళ్లు కడుతున్నామని, మొత్తంగా 28.30 లక్షల ఇళ్లు పేదల కోసం నిర్మిస్తున్నామని రాజీవ్ కుమార్‌కు సీఎం వెల్లడించారు. 17,005 కొత్త కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు రూ.34,109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని జగన్ పేర్కొన్నారు. ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం కష్టమని స్పష్టం చేశారు. అందువల్ల సంబంధిత మంత్రిత్వ శాఖలతో మాట్లాడి ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలకు అయ్యే ఖర్చును పీఎంఏవైలో భాగంగా చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

Also Read:ఢిల్లీలో జగన్ బిజీబిజీ: కేంద్ర మంత్రులతో వరుస భేటీలు

పోలవరం పీపీఏతో పాటు కేంద్ర జలమండలి సిఫార్సులు, కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహా మండలి (టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ-టీఏసీ) అంగీకరించిన విధంగా 2017-18 ధరల సూచీ ప్రకారం రూ.55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి నీతి ఆయోయ్ ఛైర్మన్‌ను కోరారు. 2022 జూన్‌ నాటికి ప్రాజెక్టు పనులతో పాటు భూసేకరణ, పునరావాస పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు. వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలపాని రాజీవ్‌ కుమార్‌కు జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.