Asianet News TeluguAsianet News Telugu

ముఖ్యమంత్రి జగన్ వరాలు... చిరు వ్యాపారుల కోసం నూతన పథకం

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి  కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయని...వాటిని నెరవేర్చడానికి బ్యాంకుల సహకారం చాలా అవసరమని అన్నారు. 

AP CM Jagan Meeting With state bankers committee
Author
Amaravathi, First Published Mar 18, 2020, 4:54 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌‌బీసీ)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకులు మరింత ముందుకురావాలని సూచించారు. ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవన్నారు. వైయస్సార్‌ నవోదయం పథకం కింద ఎంఎస్‌ఎంఈలకు, ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఇచ్చే రుణాలు, ఎస్సీ,ఎస్టీ, మహిళలకిచ్చే రుణాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. 

స్వయం సహాయక సంఘాల రుణాలపై కూడా దృష్టి పెట్టాలని... మహిళలకు వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్ఫధంతో ఉండాలని జగన్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీ ఒకటిలో ఉన్న 6 జిల్లాల్లో ఒకలా, మిగిలిన 7 జిల్లాలో ఇంకోలా వడ్డీరేట్లు  ఉన్నాయన్నారు. బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు చాలా ఎక్కువగా 12.5 శాతం, 13.5 శాతం వున్నాయని...వడ్డీరేట్ల విషయలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని బ్యాంకులకు సూచించారు. 

మరోవైపు ప్రభుత్వం తరఫున సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బ్యాంకులు ఈ స్థాయిలో వడ్డీలు వసూలు చేయడంపై మంచిదికాదని... ఈ విషయంపై ఆలోచించాలన్నారు. వైయస్సార్‌ కడప జిల్లా మాదిరిగానే బ్యాంకుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ అమలుచేసి గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నామన్నారు. ఇలా గ్రామాల ఆర్థిక వ్యస్థలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు.

AP CM Jagan Meeting With state bankers committee

''గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలపై ఆధారపడే పరిస్థితులను తగ్గిస్తున్నాం. గ్రామ సచివాలయలు, విలేజ్‌ క్లినిక్కులు, ఇంగ్లిషు మీడియంలో బోధించే పాఠశాల, రైతు భరోసా కేంద్రాలతో గ్రామాలలో విప్లవాత్మకంగా మార్పులు తీసుకువస్తున్నాం. గ్రామ సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆర్‌బీకే(రైతు భరోసా కేంద్రం) లో ఇంటర్నెట్‌ కియోస్క్‌ అందుబాటులో ఉంటుంది.  ఈ కియోస్క్‌ ద్వారా తమకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఆర్డర్‌ చేస్తే నాణ్యతా నిర్దారణలతో అవి రైతులకు అందుబాటులోకి వస్తాయి'' అని తెలిపారు.

''ఈ–పంటలో భాగంగా విలేజ్‌ అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లతో వివరాలు నమోదు చేయిస్తున్నాం. దీనికోసం వీరందరికీ కూడా ట్యాబులు ఇస్తున్నాం. ఈ వివరాలను బ్యాంకులతో అనుసంధానం చేస్తాం.డిమాండు సప్లయిలను పరిగణలోకి తీసుకుని ఏ పంటలు వేయాలన్నదానిపై రైతుకు ఆర్బీకేల ద్వారా సూచనలు చేస్తాం.ఈ– పంటలో నమోదైన వివరాల ఆధారంగా సాగుచేస్తున్న పంటలకు తగినట్టుగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది'' అన్నారు. 

''అలాగే కౌలు రైతులు సాగుచేస్తున్న పంట వివరాలు అందుబాటులో ఉంటాయి. రెవెన్యూ అసిస్టెంట్లు ద్వారా కౌలు రైతు, యజమాని ఇద్దరూ అగ్రిమెంటు మీద సంతకం చేసి బ్యాంకు రుణం కోసం ఇస్తారు. బ్యాంకులు వారికి ఉదారంగా రుణాలు ఇవ్వాలి. రైతులకు పండించిన పంటకు తగిన ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. తాను ఆశించిన ధర రాకపోతే రైతులు ఆర్బీకే ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తారు. ధర రాని పక్షంలో ప్రభుత్వం జోక్యంచేసుకుని మార్కెట్లో పోటీని పెంచేలా, రైతులకు కనీస గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటుంది. మే 15న ఆర్బీకే ద్వారా రైతు భరోసా ఇవ్వబోతున్నాం''  అని జగన్ వెల్లడించారు. 

''మైక్రోఎంటర్‌ ప్రైజెస్‌ కోసం జూన్‌లో ఓ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. గుర్తింపు కార్డులతో రూ. 10వేలు చొప్పున వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్నది ఆలోచన. చిరు వ్యాపారులు, తోపుడు బళ్లమీద చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు. ఇది వాళ్లకి  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మాకు కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయి. వాటిని నెరవేర్చడానికి మీ సహకారం చాలా అవసరం'' అని బ్యాంకర్లను కోరారు సీఎం.

AP CM Jagan Meeting With state bankers committee

''కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టింది. రాయలసీమ కరువు నివారణా చర్యల్లో భాగంగా వరద జలాలను తీసుకెళ్లే కాల్వలను విస్తరిస్తున్నాం. ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం వరకు నీరు పోవాలి. దివంగత నేత వైయస్సార్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది'' అని అన్నారు. 

''వాటర్‌ గ్రిడ్‌ ద్వారా మంచినీటి సరఫరా అందించాలి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆక్వా కల్చర్‌ వల్ల నీరు కలుషితం అవుతుంది. శ్రీకాకుళంలోని కిడ్నీ బాధితులు సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని ప్రజలకు వాటర్‌ గ్రిడ్‌ ద్వారా నీటిని అందించడానికి ముందడుగు వేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటికీ మీ సహకారం కావాలి'' అని బ్యాంకర్లను కోరారు. 

ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌, ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాద్‌ రెడ్డి,  వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఫైనాన్స్ ఎస్‌.ఎస్‌.రావత్, , ప్రెసిడెంట్‌ (ఎస్‌ఎల్‌బీసీ) కె పకీరిసామి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ కే వి నాంచారయ్య,  ఆర్బీఐ జనరల్‌ మేనేజర్‌ సుందరం శంకర్, నాబార్డ్‌ సీజీఎం ఎస్‌.సెల్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios