నెల్లూరు జిల్లా కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కన్న కలలను తాము సాకారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతామని తెలిపారు.  

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లా కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కన్న కలలను తాము సాకారం చేస్తామని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కాగానే.. దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున సీఎం జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా పలువురు సభ్యులు గౌతమ్ రెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే మాట్లాడిన సీఎం జగన్.. గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. 

తన సహచరుడు, మిత్రుడు గౌతమ్ రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి తనకు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. వయస్సులో తన కన్నా ఒక్క సంవత్సరం పెద్దవాడైనా తనను అన్న అని గౌతమ్‌రెడ్డి ఆప్యాయంగా పిలిచేవారని సీఎం జగన్ గుర్తుచేసుకున్నారు. యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీలో గౌతమ్‌రెడ్డి ఉన్నత చదువులు చదివారని తెలిపారు. 

తాను సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు తనతో పాటు గౌతమ్ నిలబడ్డారని.. ఆయన నిలబడటమే కాకుండా అతని తండ్రిని కూడా తనతో నడిపించారని జగన్ గుర్తుచేశారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. పారిశ్రామిక మంత్రిగా గౌతమ్‌రెడ్డి చాలా కృషి​ చేశారని తెలిపారు.

గౌతమ్ రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలలను నెరవేరుస్తామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేస్తామని అన్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తామని తెలిపారు. అనంతరం ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి.