జగన్ కుట్ర: పరకాల రాజీనామాపై చంద్రబాబు వైఖరి ఇదీ...

AP CM handrababu says he trusts Parakala
Highlights

రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ రాజీనామాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టం చేశారు.

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ రాజీనామాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టం చేశారు. పార్టీ నేతల వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శల నేపథ్యంలో పరకాల ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

పరకాలను లక్ష్యం చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలను చేయడాన్ని చంద్రబాబు కుట్రగా భావిస్తున్నారు. ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బురద చల్లుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన పార్టీ నేతలను ప్రశ్నించారు. 

పరకాల ప్రభాకర్ ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని వైసిపి విమర్శలు చేసినట్లుగా భావించకూడదని, ప్రభుత్వంపై బురద చల్లే పనిలో భాగంగానే పరకాల ప్రభాకర్ పై విమర్శలు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. 

పరకాల ప్రభాకర్ పై ఆయన తన విశ్వాసాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పరకాల ప్రభాకర్ రాజీ పడిన దాఖలాలు లేవని ఆయన కితాబు ఇచ్చినట్లు చెబుతున్నారు.

పరకాల ప్రభాకర్ సతీమణి నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో పరకాల ప్రభాకర్ ను లక్ష్యం చేసుకుని వైఎస్ జగన్ మాత్రమే కాకుండా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు బిజెపితో ఇంకా దోస్తీ కొనసాగిస్తున్నారని చెప్పడానికి దాన్ని నిదర్శనంగా చూపుతున్నారు. 

loader