Asianet News TeluguAsianet News Telugu

తొమ్మిదో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రభుత్వం ఎదుర్కొన్న ఇబ్బందులపై ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేస్తోన్నసంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎనిమిది శ్వేతపత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి.. ఇవాళ తొమ్మిదో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో   చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. 

AP CM Chandrbabu naidu released white paper
Author
Amaravathi, First Published Dec 31, 2018, 1:26 PM IST

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రభుత్వం ఎదుర్కొన్న ఇబ్బందులపై ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేస్తోన్నసంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎనిమిది శ్వేతపత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి.. ఇవాళ పరిశ్రమలు, ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్‌మెంట్‌పై తొమ్మిదో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో  చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగం వెనుకబడి వుందన్నారు. అయితే వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అందువల్ల వ్యవసాయం రంగంలో 10.5 శాతం వృద్ధి లభించిందని దీనిని కనీసం 15 నుంచి 20 శాతం పెంచగలిగితే ఏపీ నెంబర్‌వన్ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు.

వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగంపై 58 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. వీరందరిని సేవారంగం వైపుకు మళ్లీంచినప్పుడు తలసరి ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంపై దృష్టి సారించామన్నారు. తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ వాటా 9.6 శాతం వృద్ధిని పొందామని.. ఇదే సమయంలో జాతీయ సగటు 16.7 ఉందన్నారు.

ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు రావాలంటే టూరిజం అభివృద్ది చెందాలని చంద్రబాబు తెలిపారు. విద్యుత్ సరిగా సరఫరా లేని కారణంగా నాడు ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, పెట్టుబడులు సైతం ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో విశాఖ నుంచి చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గురించి ప్రస్తావించినప్పటికీ ఆ ప్రాజెక్ట్‌కు కాకుండా ఢిల్లీ-ముంబై పారిశ్రామిక క్యాడర్‌కు నిధులను కేటాయించారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రీన్ ఫీల్డ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌లు కూడా నిర్మిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏపీని మోసం చేసిందని చంద్రబాబు అన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి సహకరించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దానిని చేపట్టాల్సి వచ్చిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు దేశం 7.1 శాతం వృద్ధిని సాధిస్తే.. ఏపీ 9.2 శాతం వృద్ధిని సాధించిందని సీఎం వెల్లడించారు.

తయారీ రంగంలో దేశం 8.43 శాతం వృద్దిని సాధిస్తే,  ఆంధ్రప్రదేశ్ 14.35 శాతం వృద్దని కనబరిచిందన్నారు. 2015లో ఈజ్ ఆఫ్ డూయింగ్‌ ర్యాంకింగ్‌లో రెండవ స్థానంలో ఉన్నామని, 2016, 17లో అగ్రస్థానంలో నిలిచామన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా 21 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. 21 డిసెంబర్ నాటికి 33, 565 కంపెనీలకు అనుమతులు మంజూరు చేశామని గుర్తు చేశారు.

పబ్లిక్ సర్వీస్ డెలీవరి గ్యారెంటీ చట్టాన్ని తీసుకొచ్చామని, తద్వారా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై విచారణ జరుపుతున్నామన్నారు. జీఐఐ సిస్టం ఫర్ ఇండస్ట్రీయల్ ల్యాండ్ అవెలబిలిటీ, ఆన్‌లైన్ సిస్టమ్ ఫర్ ఇన్‌స్టాంట్ సెక్యూరిటీ ఆఫ్ బిల్డింగ్ ల్యాండ్స్ , థర్డీ పార్టీ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్, ఇలాంటి ఎన్నో పథకాలను తీసుకోచ్చామన్నారు.

12 పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చి, ఎప్పటికప్పుడు దానిలో అప్‌డేట్స్ ఇస్తున్నామన్నారు.   2014-19లో  రూ.1593 కోట్ల రూపాయలు పారిశ్రామిక రంగంలో ఖర్చు చేశామన్నారు. రూ.3, 675 కోట్ల రూపాయల విలువ గలిగిన ఇండస్ట్రీయల్ ఇన్సెటివ్స్ క్లియర్ చేశామని చంద్రబాబు వెల్లడించారు. రూ. 1,816 కోట్ల రూపాయలు ఎంస్ఎంఈలకే కేటాయించామన్నారు.  

30, 349 ఎంఎస్ఎంఈలు 2014 నుంచి కొత్తగా ఏర్పడ్డాయని, దీని వల్ల రూ.14, 292 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. 3 లక్షల 30 వేల మందికి ఉద్యోగాలు లభించాయని సీఎం తెలిపారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. 1317 ఎకరాల్లో భూసేకరణ పనులు జరుగుతున్నాయని, మరికొందరు ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు తరలివస్తున్నాయన్నారు.

ప్రతి ఒక్క ఇంటికి ఒక ఇండస్ట్రీయలిస్ట్ ఉండాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరు ఉత్పత్తి చేసే వస్తువులు భారతదేశం మొత్తం మార్కెటింగ్ చేసే స్థాయికి ప్రజలు ఎదగాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు అన్నారు. 18 ప్రభుత్వ విభాగాలు 2, 622 ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదుర్చుకున్నాయని, రూ.15 లక్షల 48 వేల 743 కోట్ల రూపాయలు పెట్టుబడులు, 32 లక్షల 35 వేల 916 మందికి ఉద్యోగాలు లభించించాయన్నారు.

ఎంఎస్ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని, ఏపీలో ప్రతి ఒక్క యువకుడు ఒక పారిశ్రామిక వేత్త కావాలని సీఎం పిలుపునిచ్చారు. విశాఖలో ఐటీ కారిడార్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎన్‌ఈఎల్ఐటీని శ్రీకాకుళం, తిరుపతిల్లో ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రప్రభుత్వం మోసం చేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇండస్ట్రియల్ పాలసీ, ప్రభుత్వ విశ్వసనీయత వల్లే కియా మోటార్స్ వంటి సంస్థలు ఏపీకి తరలి వచ్చాయన్నారు.

జనవరి 8న ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు తరలివస్తాయని జగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వచ్చుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని సీఎం గుర్తు చేశారు. భావనపాడు, కృష్ణపట్నం, మచిలీపట్నాలను మేజర్ పోర్టులుగా అభివృద్ది చేస్తామని చంద్రబాబు తెలిపారు. పలు రంగాల్లో ఉన్నతాధికారులకు తోడుగా ప్రైవేట్‌గా సీఈవోలను రిక్రూట్‌ చేసుకుంటామని ముఖ్యమంత్రి వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios