ప్రతిసారీ ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి బాగా అలవాటు. ఆయన అలా వివాదంలో ఇరుక్కున్న ప్రతిసారీ.. పార్టీకి తలనొప్పులు మొదలౌతాయి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న ప్రతిపక్ష నేతలకు చింతమనేని వివాదాన్ని సాకుగా చూపి.. పార్టీపై విమర్శలు చేస్తుంటారు.

ఇలా చింతమనేని కారణంగా పార్టీకి తలనొప్పులు రావడం ఒకసారి, రెండుసార్లు కాదు. ఇప్పటికి చాలా సార్లు జరిగింది. ఇన్నిసార్లు చూసీచూడనట్టు వదిలేసిన చంద్రబాబు ఈ సారి మాత్రం సీరియస్ అయ్యారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇలాంటి వివాదాలు తీసుకువచ్చి పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తున్నారంటూ మండిపడ్డారు.

చింతమనేనిని స్పెషల్ గా పిలిచి మరీ చివాట్లు పెట్టారు. ఇటీవల ఓ వ్యక్తిపై చింతమనేని అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు చింతమనేనిపై కేసు కూడా నమోదైంది. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.

ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడంలేదని చింతమనేనిపై మండిపడ్డారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చింతమనేని తీరుపై పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, ఒకరు చేసిన తప్పుకు అందరూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్‌ ఉంటుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.