అమరావతి రెండు సార్లు రాజధానిగా వెలిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రూ. 150 కోట్లతో నిర్మించనున్న శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి సీఎం గురువారం శంకుస్థాపన చేశారు.

ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణం, బీజావాపనం కోసం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడి నిర్మించనున్న ప్రాంతంలో సీఎం నాగలితో స్వయంగా భూమిని దున్ని నవధన్యాలు చల్లారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అలిపిరి ఘటనలో శ్రీవారి దయతోనే తాను ప్రాణాలతో బయటపడ్డానన్నారు.

వెంకటేశ్వరస్వామి రాష్ట్రంలో కొలువై ఉండటం ప్రజల అదృష్టమన్నారు. టీటీడీ నిర్మించే ఆలయానికి 25 ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు అమరావతిపై ఉండాలని, కష్టపడి పనిచేసే వారికి దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని, విభజనతో అన్ని పోయినా... తిరుమల శ్రీవారు ఉన్నారన్న ధైర్యంతో ముందుకు వెళ్లానన్నారు.