ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కోపం వచ్చింది. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. "మీ తప్పులు నా నెత్తిన వేసుకోను. మీ కోసం నేను మునగను. కొంతమంది పైపైన తిరుగుతున్నారు. వాటిని నేను గమనిస్తున్నాను. నాకు ఏ నియోజవర్గంలో ఏమి జరుగుతుందో మొత్తం తెలుసు! మీరేంచేస్తున్నారో నాకు తెలియదనుకుంటే పొరపాటు పడినట్టే. మీకు త్వరలోనే నియోజకవర్గాల్లో మీ పరిస్థితి ఏంటో చెబుతాను'' అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

గత కొంత కాలంగా కొందరు ఎమ్మెల్యేల తీరు సరిగా లేదనే వాదనలు వినపడుతూనే ఉన్నాయి. వారి కారణంగా ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత మొదలౌతోందనే భావన చంద్రబాబులో పెరిగిపోయింది. దీంతో.. అలాంటి నేతలకు చురకలు అంటించడం మొదలుపెట్టారు. తాజాగా.. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

"సైకిల్ ర్యాలీలు నిర్వహించమంటే కొంతమంది ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు పైపైనే తిరుగుతున్నారు. నేను ఏదైనా పని చెబితే ఒక చెవితో విని, మరో చెవిలోంచి వదిలేస్తున్నారు. అటువంటి వారిని వదిలిపెట్టను. సీరియస్‌నెస్ లోపించింది. కొందరు నేతలైతే విపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టలేకపోతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీతో పాటు పార్టీ మునుగుతుంది. అలా జరగనివ్వడానికి నేను సిద్ధంగా లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి వారి స్థానమేంటో త్వరలోనే చూపిస్తాను'' అంటూ చంద్రబాబు నేతలను ఉద్దేశించి హెచ్చరించారు.