ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో సైబరాబాద్ సృష్టించినట్లుగానే ఇప్పుడు ఏపీలో సిలికాన్ సిటీని నిర్మిస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతికి సమీపంలో ఏర్పేడులో రూ.2,200 కోట్లతో ఏర్పాటు చేయనున్న టీసీఎల్ కంపెనీకి సీఎం ఇవాళ భూమిపూజ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు-తిరుపతి-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు సిలికాన్ సిటీ అని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. ఏడాదికి 60 లక్షల టీవీలు తయారు చేసే ప్రణాళికతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ద్వారా సుమారు 8 వేల మందికి ఉపాధి దొరుకుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

ఏపీ త్వరలోనే హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా మారబోతోందన్నారు. ఈ రంగంలో ఇప్పటి వరకు 59 కన్నా ఎక్కువ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించామన్నారు. వీటి ద్వారా లక్ష ఉద్యోగాలు రానున్నాయని.. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 20 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు.

రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగాలు ఈ జిల్లాలోనే ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచంలోనే గొప్ప పారిశ్రామిక నగరంగా షెంజెన్ సిటీకి పేరుందని ఇప్పుడు ఇలాంటి పారిశ్రామిక వాతావరణాన్నే ఇప్పుడు మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ప్రారంభించబోతున్నామన్నారు. రాబోయే రోజుల్లో సిలికాన్ సిటీ, షెంజెన్ కలిసి పనిచేస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి రూ.22 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు.