Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ తో పొత్తుపై చర్చ: రాహుల్ తో చంద్రబాబు భేటీ

హస్తిన కేంద్రంగా మరోమారు జాతీయ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెరలేపారు. గతేడాది డిసెంబర్ 9న ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు 28 రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. అనంతరం కొత్త సంవత్సరంలో తొలిసారిగా రాహుల్ గాంధీని కలిశారు. 

ap cm chandrababu naidu meets aicc president rahulgandhi
Author
Delhi, First Published Jan 8, 2019, 8:38 PM IST

ఢిల్లీ: హస్తిన కేంద్రంగా మరోమారు జాతీయ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెరలేపారు. గతేడాది డిసెంబర్ 9న ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు 28 రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. అనంతరం కొత్త సంవత్సరంలో తొలిసారిగా రాహుల్ గాంధీని కలిశారు. అమరావతి నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీతో పొత్తు వంటి అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించారు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను ఏకం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బీజేపీ యేతర కూటమికి దిశానిర్దేశంపై చర్చించారు. 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కార్యాచరణ కూటమి ప్రణాళిక రూపొందించడం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఎజెండా వంటి అంశాలపై చర్చించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను అన్నింటిని కలుపుకుని బలమైన శక్తిగా కూటమిని తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కూటమి ప్లాన్ వంటి అంశాలపై చంద్రబాబు చర్చించారు. 

ఇకపోతే ఈ నెల 19న కోల్‌కతాలో బీజేపీ యేతర పార్టీల బహిరంగ సభ తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించే భారీ ర్యాలీలపై చంద్రబాబు చర్చించారు. జనవరి 19 తర్వాత ఎక్కడ ఎలాంటి సమావేశాలు నిర్వహించాలి. ఎవరు ఎక్కడ హాజరు కావాలి? ఆయా చోట్ల ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు వంటి అంశాలపై రాహుల్ గాంధీతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సైతం చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో చర్చించారు. అలోక్ వర్మను తప్పించడంపై బీజేపీ యేతర ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వారిలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యులుగా చెప్పవచ్చు. 

అయితే అలోక్ వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఇప్పటికే రాహుల్ గాంధీ, చంద్రబాబులు ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పు బీజేపీ యేతర కూటమికి మాంచి ఊపునిచ్చిందన్న విషయాన్ని బాబు రాహుల్ గాంధీతో చెప్పినట్లు తెలుస్తోంది. 

అలాగే ఫిబ్రవరి నెలలో అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉన్నారు చంద్రబాబు. ఆ సభకు జాతీయ పార్టీ నేతలను ఆహ్వానించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అందులో భాగంగా పనిలో పనిగా సభకు హాజరుకావాలంటూ కోరినట్లు తెలుస్తోంది. 

ఫిబ్రవరి నెలలో అమరావతి వేదికగా ఏపీకి బీజేపీ చేసిన అన్యాయం, రాష్ట్రాలపై కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందని, రాష్ట్రప్రభుత్వాల హక్కులను కాల రాస్తుందని గళమెత్తే అవకాశం ఉంది. రాహుల్‌ గాంధీతో భేటీ అనంతరం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో చంద్రబాబు సమావేశం కానున్నారు. జాతీయ నాయకులతో భేటీ అనంతరం టీడీపీ ఎంపీలతో సమావేశం కానున్నారు చంద్రబాబు నాయుడు. 

Follow Us:
Download App:
  • android
  • ios