మంత్రుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలో సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులతో పలు అంశాలపై చర్చించిన ఆయన వారికి క్లాస్  పీకారు.

సుమారు గంటన్నరపాటు జరిగిన భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికలతో  పాటు త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇవ్వడంలో మంత్రులు విఫలమయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేనికైనా తానోక్కడినే సమాధానం చెబుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులెవరూ ప్రతిపక్షాన్ని పట్టించుకోవడం లేదని.. సీరియస్‌నెస్ లేకపోతే ఎలా అంటూ క్లాస్ పీకారు.

ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వకపోతే, ప్రతిపక్ష పార్టీల వాదనే జనంలోకి వెళుతుందని మంత్రులను హెచ్చరించారు. దానితో పాటు జాతీయ రాజకీయాలపైనా ఆయన చర్చించారు. జాతీయ స్థాయిలో ముందస్తుగానే కూటమిని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.

ఎన్నికల తర్వాత సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ముందస్తుగానే కూటమిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఏపీలో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.