రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు పలువురు నేతలు పార్టీలోకి వస్తుండటంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సానుకూల నాయకత్వానికి టీడీపీ ఉదాహరణ అని, ప్రతికూల నాయకత్వానికి జగన్ రుజువని ఎద్దేవా చేశారు.

డబ్బుతో ప్రజాభిమానాన్ని కొనగొలమనేది వైసీపీ అధినేత అహంభావమని సీఎం మండిపడ్డారు. జగన్మోహనరెడ్డి అహంభావం భరించలేకే వంగవీటి రాధా, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీకి దూరమయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకుడు అనే వాడికి అహంభావం ఉండరాదన్నారు.

సంస్థాగతంగా టీడీపీ అంత బలమైన పార్టీ దేశంలో మరొకటి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీకి కేంద్రం ఇంకా రూ. 1.16 లక్షల కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశానని, కానీ బీజేపీ నేతలు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర నిధులపై జగన్మోహన్ రెడ్డి ప్రధానిని ప్రశ్నించరని, బాధ్యతారాహిత్యానికి జగన్ ప్రతిబింబమని చంద్రబాబు విమర్శించారు. నిపుణుల కమిటీ రూ.85  వేల కోట్లు ఇవ్వాలని చెప్పిందని, పవన్ కల్యాణ్ నియమించిన జెఎఫ్‌సీ రూ. 75 వేల కోట్లు ఇవ్వాలని నివేదిక ఇచ్చిందని సీఎం గుర్తుచేశారు.