హైకోర్టు విభజన వల్ల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కోర్టు కేసుల నుంచి తాత్కాలిక ఊరట లభిస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. హైకోర్టు విభజన నోటిఫికేషన్‌పై మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ కేసులన్నీ ఇప్పుడు లాజిక్‌గా వస్తున్నాయని.. హైకోర్టు విభజన తర్వాత కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి బదిలీ అవుతారని, ట్రయల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు కేసు మళ్లీ మొదటికి వస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

కోర్టు కేసుల నుంచి బయటపడటానికే జగన్ తన సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారం గురించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేని చంద్రబాబు ఆరోపించారు. అమరావతిలో హైకోర్టు భవనానికి స్థలం కేటాయించామని, విభజన ప్రక్రియ ప్రారంభిస్తే నిర్మాణం చేపడతామని తాను కోరినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.

నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కనీసం 30 రోజుల సమయం ఇస్తారని, కానీ కనీస సంప్రదాయాలను పాటించలేదని ఏపీ సీఎం మండిపడ్డారు. హైకోర్టు విభజన నాటి ఆంధ్రప్రదేశ్ విభజనను గుర్తు చేస్తోందని 5 రోజుల్లో ఉద్యోగులు, న్యాయవాదులు ఉన్నపళంగా హైదరాబాద్‌ను వీడలేరని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం ప్రవర్తించవలసిన తీరు ఇది కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.