రానున్న రోజుల్లో ఆడబిడ్డలు పారిశ్రామికవేత్తలు కావాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా నేలపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. డ్వాక్రా సంఘాలకు పసుపు-కుంకుమ కింద రూ. 10 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

కష్టాల్లో ఉన్న ఆడబిడ్డలకు అప్పు అయినా చేసి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆర్ధిక సాయం చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.8,400 కోట్లు ఇచ్చామని సీఎం తెలిపారు. నాలుగు సంవత్సరాల్లో విడతల వారీగా రూ.2,500 కోట్లను వడ్డీ లేకుండా మాఫీ చేశామన్నారు.

భర్త కానీ, అత్తమామలు కానీ, తల్లిదండ్రులు కానీ చేతిలో రూ.21 వేలు పెట్టి ఇష్టమొచ్చిన పని చేసుకోమన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఆడపిల్లలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతోనే డ్వాక్రా సంఘాలను రూపొందించానన్నారు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో సైతం డ్వాక్రా సంఘాలకు ఆర్థిక సాయం ఇవ్వలేదన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకన్నా మిన్నగా డ్వాక్రా సంఘాలు నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు ప్రశంసించారు. కట్టెల పొయ్యితో నా తల్లి బాధపడినట్లు మరే ఇతర ఆడబిడ్డ కష్టపడకూడదని దీపం పథకం ప్రవేశపెట్టానని సీఎం గుర్తు చేశారు.

పశుమిత్ర ద్వారా గ్రామాల్లో దాణా ఇస్తున్నామని, పశుసఖీ ద్వారా పశువుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారు. వృక్షమిత్ర, మధ్యాహ్నా ఆహార పథకం, ఆదరణ-2లో సైతం ఆడబిడ్దలు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని సీఎం అన్నారు.

త్వరలోనే మహిళలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాల తర్వాత రాష్ట్రంలోని మిగిలిన వారికి స్మార్ట్‌ఫోన్‌ను అందజేస్తామన్నారు. ప్రకృతి సేద్యంలో సైతం డ్వాక్రా సంఘాలు భాగస్వామ్యమవ్వాలని చంద్రబాబు కోరారు.

తొలి విడతలో రూ. 10 వేలు, రెండవ విడతలో రూ.25 వేలు, మూడవ విడతలో రూ.50 వేల చొప్పున సాయం చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్య వివరాల్ని సైతం డిజిటలైజేషన్ చేస్తామని సీఎం తెలిపారు.