ల్యాండ్ పూలింగ్ వల్ల ఏపీలోని కొందరు నేతలకు నిద్రపట్టడం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఇంధనం, మౌలిక వసతులపై ఆయన ఇవాళ శ్వేత పత్రం విడుదల చేశారు.

అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి, ఎంతో శాస్త్రియంగా జరిగిన ల్యాండ్ పూలింగ్ విధానానికి కొందరు నేతలు అవినీతి మరకను అంటిస్తున్నారని బాబు మండిపడ్డారు.

పోలానికి బదులుగా అభివృద్ధి చేసిన 25 శాతం భూమిని తిరిగిచ్చామని ఇందులో ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. ఎన్‌జీవోలకు డబ్బులు ఇచ్చి ల్యాండ్ పూలింగ్‌పై పనిగట్టుకునిఆరోపణలు చేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

విభజన చట్టానికి మోక్షం కలిగించడం లేదని, కేంద్రం అంటే తమకు వ్యతిరేకత లేదని.. న్యాయం చేయమంటున్నామని కోరుతున్నామని వివరించారు. జలవివాదాల వల్ల రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని, నదుల అనుసంధానం ఒక్కటే వీటికి పరిష్కారమని సీఎం అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నివాస స్థలాలు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు.