ఉమ్మడి హైకోర్టు విభజనకు నోటీఫికేషన్ వెలువడిన నేపథ్యంలో దీనిపై స్పందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఇంధనం, మౌలిక వసతులపై శ్వేత పత్రాన్ని విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టును విభజించాల్సిందిగా ముందు ఏపీ ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందన్నారు.

అమరావతిలో హైకోర్టు భవనానికి స్థలం కేటాయించామని, విభజన ప్రక్రియ ప్రారంభిస్తే నిర్మాణం చేపడతామని తాను కోరినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కనీసం 30 రోజుల సమయం ఇస్తారని, కానీ కనీస సంప్రదాయాలను పాటించలేదని ఏపీ సీఎం మండిపడ్డారు.

హైకోర్టు విభజన నాటి ఆంధ్రప్రదేశ్ విభజనను గుర్తు చేస్తోందని 5 రోజుల్లో ఉద్యోగులు, న్యాయవాదులు ఉన్నపళంగా హైదరాబాద్‌ను వీడలేరని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం ప్రవర్తించవలసిన తీరు ఇది కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.