ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా ఆయన బుధవారం అమరావతిలో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధం లేని వ్యవస్థ ఇంటెలిజెన్స్ అని, తన భద్రతను పర్యవేక్షించే అధికారిని కూడా బదిలీ చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఏ కారణంతో ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారో సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు టీడీపీ వైపు ఉన్నంత వరకు ఎవరి కుట్రలు సాగవని తెలిపారు.

రానున్న రోజుల్లో ప్రత్యర్థులు ఇంకా ఎన్నో కుట్రలు చేసే అవకాశం ఉన్నందున దేన్నైనా గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మోడీ మళ్లీ గెలిస్తే మైనార్టీలెవరూ బయటకు రాలేని అభద్రతా వాతావరణం నెలకొంటుందని, గోద్రా లాంటి ఘటనలు పునరావృతమవుతాయని చంద్రబాబు హెచ్చరించారు.

పోలవరం ఆపాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించటం నీచమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించిన చంద్రబాబు... అతి విశ్వాసంతోనే టీఆర్ఎస్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు.