Asianet News TeluguAsianet News Telugu

అమరావతికి హైకోర్టు రావడంతో.. విభజన ప్రక్రియ పూర్తయ్యింది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టు ఏర్పాటు చేయడం చారిత్రక సంఘటనగా అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏపీ హైకోర్టు భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

AP CM Chandrababu naidu comment at new high court opening cermony
Author
Amaravathi, First Published Jan 1, 2019, 1:17 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టు ఏర్పాటు చేయడం చారిత్రక సంఘటనగా అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏపీ హైకోర్టు భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పరిపాలన వ్యవస్థ మొత్తం అమరావతికి రావడానికి సమయం పట్టిందన్నారు.

ఎలాంటి మౌలిక వసతులు లేనప్పటికీ తక్కువ సమయంలో హైకోర్టు తాత్కాలిక భవనాలను సిద్ధం చేశామని చంద్రబాబు అన్నారు. తాను స్వయంగా చీఫ్ జస్టిస్‌కు ఫోన్ చేసి ఇబ్బందుల గురించి చెప్పానని...ఆయన పెద్ద మనుసుతో అర్ధం చేసుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు.

హైకోర్టు అమరావతికి తరలిరావడంతో రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం పూర్తైనట్లేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కష్టాలు, ఇబ్బందులున్నా అందరి సహకారంతో అమరావతిని చారిత్రక నగరంగా తీర్చిదిద్దుతానన్నారు.

దేశంలోనే అత్యుత్తమ హైకోర్టుగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తయారవ్వాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రాజధానుల్లో టాప్ 5లో అమరావతిని తీర్చిదిద్దుతానన్నారు. దేశంలో ఏ హైకోర్టు కూడా కొత్త సంవత్సరంలో ప్రారంభించలేదన్నారు.

చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ వాటిని సర్దుపోవాలని వీలైనంత త్వరలోనే ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి న్యాయవాదులకు, సిబ్బందికి తెలిపారు. అంతకు ముందు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర సిబ్బందికి చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త సంవత్సరం అందరు సుఖసంతోషాలతో జీవించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios