కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. ఏపీ పట్ల కేంద్రం వ్యహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందన్నారు. ఏపీని దేశంలో ఒక భాగంగా కేంద్రం చూడటం లేదని మండిపడ్డారు.

విశాఖ ఉత్సవ్ లో ఎయిర్ షో నిర్వహించనివ్వకుండా అడ్డుకున్నారని, ఎయిర్ షోని కేంద్రం రద్దు చేసిందని తెలిపారు. అటు హైకోర్టు విభజన విషయంలోనూ సంప్రదింపులు జరపలేదన్నారు. సమయం ఇవ్వకుండా జనవరి1 కల్లా వెళ్లిపోవాలి అనడం సరికాదని అన్నారు. రాష్ట్రాల విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. 

రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటే కేంద్రం సహకరించ లేదని, ఇప్పుడు కేంద్రం రుణమాఫీ అంటే ఎన్నికల స్టంటే అని వ్యాఖ్యానించారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును రాజ్యసభలోనూ వ్యతిరేకిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
 
కడప స్టీల్ ప్లాంట్‌కు సహకరించని కేంద్రానికి పన్నులు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీపై సమాచారం ఇవ్వలేదని కేంద్రం అనడం సరికాదన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రానికి వైసీపీ ఊడిగం చేస్తోందని దుయ్యబట్టారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ప్రజలకు వైసీపీ సంజాయిషీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు.