ఢిల్లీ: ఏపీలో కేబినెట్ మీటింగ్ పై రచ్చ జరుగుతోంది. కేబినెట్ మీటింగ్ పెట్టి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్తుంటే....ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచిస్తున్నారు. 

ఇలా కేబినెట్ మీటింగ్ వ్యవహారం సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంల మధ్య చిచ్చు రేపుతోంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం కేబినెట్ భేటీ నిర్వహించి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

కేబినెట్ భేటీ అనేది ప్రభుత్వ నిర్ణయమని ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎస్ అమలు చెయ్యాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. మే 10, 12,13 తేదీలలో ఏదో ఒకరోజు  కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు ఎన్నికల సంఘంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజాస్వామ్యాన్ని విశ్వసనీయతను కాపాడతారో లేదో ఈసీ తేల్చుకోవాలని సూచించారు. ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. తమ పోరాటం ప్రజల కోసమేనన్న చంద్రబాబు ప్రజలు ఎవరికి ఓటేశారు, వేసిన ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవాలన్నదే తమ ప్రయత్నమని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పారదర్శకతపై తాము పోరాటం చేస్తుంటే బీజేపీ ఎదురుదాడికి దిగుతుందని విమర్శించారు.