Chandrababu Bail : సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ఏపీ సీఐడీ...
దర్యాప్తులో లోపంగా భావిస్తూ బెయిల్ ను మంజూరు చేస్తున్నట్లుగా చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన ఇతర నిందితులందరూ బెయిల్ పై ఉన్నారని పేర్కొంది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై సిఐడి సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సోమవారం నాడు టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టు భారీ ఊరటను ఇచ్చింది. ఈనెల 29 నుంచి ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు అని తెలిపింది. 28వరకు మధ్యంతర బెయిల్ గడువు ఉండడంతో.. అప్పటివరకు ఆ బెయిల్ కు సంబంధించిన నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
Chandrababu Naidu bail : తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు.. అచ్చెన్నాయుడు
ఈ కేసులో చంద్రబాబు నాయుడుపై ఆరోపించిన నేరానికి సంబంధించిన ఎలాంటి ప్రాథమిక ఆధారాలను ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించలేక పోయిందని హైకోర్టు తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో దుర్వినియోగమైనట్లు చెబుతున్న నగదు టిడిపి బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లుగా ఇలాంటి ఆధారాలు లేవని చెప్పింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలకు బలమైన ఆధారాలను చంద్రబాబు రిమాండ్ విధించాలని కోరడానికి ముందే సిఐడి చూపించి ఉండాల్సిందని తెలిపింది. దర్యాప్తులో లోపంగా భావిస్తూ బెయిల్ ను మంజూరు చేస్తున్నట్లుగా చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన ఇతర నిందితులందరూ బెయిల్ పై ఉన్నారని పేర్కొంది.
చంద్రబాబు నాయుడు వైద్యం చేయించుకున్న ఆసుపత్రి, చికిత్సలకు సంబంధించిన వివరాలను, మెడికల్ రిపోర్టులను ఈ నెల 28వ తేదీలోగా విజయవాడలోని ఏసీబీ కోర్టుకు దాఖలు చేయాలని ఆదేశించింది. మధ్యంతర బెయిల్ లో పొందుపరిచిన షరతులైన.. రాజకీయ ర్యాలీలు నిర్వహించొద్దని, సమావేశాల్లో పాల్గొన్న షరతులను కాస్త ముందుగా సడలించింది. చంద్రబాబుకు చెందిన రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికపై ఈ షరతులు ప్రభావం చూపుతాయని అందుకే 31వ తేదీ వరకు కాకుండా ఈనెల 29 నుంచి సడలిస్తున్నట్లుగా ప్రకటించింది.