చంద్రబాబే ప్రధాన నిందితుడు.. కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిందే: ఏపీ సీఐడీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఏపీ సీఐడీ డీజీ సంజయ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఏపీ సీఐడీ డీజీ సంజయ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆరోపించిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబును ఈరోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్ నుంచి సీఐడీ బృందం అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌లో రూ. 550 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారు. ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు.
నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని ఆరోపించారు. చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసునని అన్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక పత్రాలను మాయం చేశారని చెప్పారు. ఈ స్కామ్‌లో బెనిఫిషియరీ కూడా చంద్రబాబేనని అన్నారు. ఈ కేసు దర్యాప్తులో చంద్రబాబు నాయుడే ప్రధాన నిందుతుడని తేలిందని చెప్పారు. చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిందేననని చెప్పారు. ఈడీ, జీఎస్టీలు కూడా ఇప్పటికే ఈ కేసును విచారించాయని చెప్పారు.
‘‘సిమెన్స్ సంస్థ నుంచి రూ.550 కోట్లు పెట్టుబడి వస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం జీవోల ద్వారా రూ.371 కోట్లు ఇచ్చేసింది. దీనికి కేబినెట్ ఆమోదం కూడా లేదు. రూ.540 కోట్ల వ్యయం అయ్యే 6 సెంటర్ ఆఫ్ ఎక్లెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకున్నారు. రూ.3 వేల కోట్లతో అన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ. 58 కోట్లతో సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేశారు. దాన్నే బాగా పెంచి చూపించి కుట్రకు పాల్పడ్డారు. డిజైన్‌టెక్‌కు చెందిన మనోజ్ పర్దాసాని, అలాగే చంద్రబాబు కార్యదర్శి శ్రీనివాస్ కూడా పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ బృందాలు దుబాయి, అమెరికాకు వెళ్తున్నాయి. ఈ కేసులో రాజేశ్, నారా లోకేశ్ పాత్రలు ఎంత ఉన్నాయన్నది తెలుస్తాం’’ అని సంజయ్ పేర్కొన్నారు.
ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఉందని స్పష్టమైందని అన్నారు. డిజైన్టెక్ కంపెనీ ఇందులో కీలకంగా వ్యవహరించిందని చెప్పారు. ఇది లోతైన ఆర్థిక నేరం అని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే చంద్రబాబుు అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ స్కామ్‌లో ముఖ్య భూమిక పోషించినవారు విదేశాలకు పారిపోయారని.. వారిని అదుపులోకి తీసుకునేలా ఇతర ఏజెన్సీల సహాయం తీసుకుంటామని చెప్పారు. ఈ స్కామ్‌లో లోకేష్ పాత్రపైనా కూడా విచారణ జరుపుతామని చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో కూడా లోకేష్ పాత్రపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్ చేశామని తెలిపారు.