Asianet News TeluguAsianet News Telugu

గంటా సుబ్బారావుకు ఏకంగా నాలుగు పదవులు.. స్కామ్‌లో లోకేష్ పాత్రపై దర్యాప్తు: ఏపీ సీఐడీ

స్కిల్ డెవపల్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా  లోకేష్ పాత్రపై కూడా దర్యాప్తు జరుపుతామని ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో కూడా లోకేష్ పాత్రపై విచారణ జరుగుతుందని తెలిపింది. 

AP CID says will investigate Nara Lokesh Role in Skill Development Scam ksm
Author
First Published Sep 9, 2023, 1:14 PM IST

మంగళగిరి:  స్కిల్ డెవపల్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా  లోకేష్ పాత్రపై కూడా దర్యాప్తు జరుపుతామని ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఏపీ సీఐడీ డీజీ సంజయ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.  ఆరోపించిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబును ఈరోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్‌ నుంచి సీఐడీ బృందం అరెస్ట్ చేయడం జరిగిందని  అన్నారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో రూ. 550 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారు. ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. 

‘‘సిమెన్స్ సంస్థ నుంచి రూ.550 కోట్లు పెట్టుబడి వస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం జీవోల ద్వారా రూ.371 కోట్లు ఇచ్చేసింది. దీనికి కేబినెట్ ఆమోదం కూడా లేదు. రూ.540 కోట్ల వ్యయం అయ్యే 6 సెంటర్ ఆఫ్ ఎక్లెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకున్నారు. రూ.3 వేల కోట్లతో అన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ. 58 కోట్లతో సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేశారు. దాన్నే బాగా పెంచి చూపించి కుట్రకు పాల్పడ్డారు.

స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటులో కుంభకోణం జరిగింది. ఇందులో రూ.550 కోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించాం. ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.371 కోట్లు.. డిజైన్ టెక్ సహా ఇతర షెల్ కంపెనీలకు వెళ్లినట్టు తేలింది. సీమెన్స్ తరఫున డిజైన్ టెక్ అనే సంస్థ ద్వారా లావాదేవీలు జరిగాయి. ఒప్పందం జరిగే సమయానికి డిజైన్ టెక్ అనే సంస్థ లేదు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా గంటా సుబ్బారావును నియమించారు. అంతేకాకుండా ఆయనకు ఏకంగా నాలుగు పదవులు కట్టబెట్టారు
  
వికాస్ కన్వెల్కర్ సహా ఇతర నిందితులు ఈ అక్రమాల్లో భాగంగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్థిక కుంభకోణంలో అప్పటి కార్యదర్శితో పాటు చంద్రబాబు తనయుడు లోకేష్ పాత్ర పైనా దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు సాక్ష్యాలను మాయం చేసే అవకాశం ఉంది అందుకే ఆయన అరెస్టు అనివార్యం అయ్యింది. ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో కూడా లోకేష్ పాత్రపై విచారణ జరుపుతున్నాం’’ అని సంజయ్ పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios