బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో వైసీపీ రెబల్ ఎంపీ, రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు కాసేపట్లో గుంటూరు కోర్టులో హాజరుపర్చనున్నారు 

బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో వైసీపీ రెబల్ ఎంపీ, రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు కాసేపట్లో గుంటూరు కోర్టులో హాజరుపర్చనున్నారు. తమ విాచారణ పూర్తయ్యే వరకు రఘురామ కృష్ణమ రాజును కోర్టుకు తరలించవద్దని హైకోర్టు శుక్రవారంనాడు సిఐడిని ఆదేశించింది. తాజాగా హైకోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టేయడంతో తదుపరి చర్యలకు సిఐడికి అవకాశం కలిగింది. దీంతో ఆయనను తొలుత వైద్య పరీక్షలు చేయించి, ఆ తర్వాత కోర్టుకు తరలిస్తారు. 

రఘురామకృష్ణమ రాజు తరఫు న్యాయవాదులు సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎప్పుడు బెయిల్ పిటిషన్ వేస్తారనే విషయంపై స్పష్టత లేదు. రఘురామకృష్ణమరాజుపై సిఐడి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. వాటిలో రాజద్రోహం కేసు కూడా ఉంది.

అంతకుముందు రఘురామకృష్ణంరాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది.ఆయన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. నేరుగా తమ వద్దకు రావడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. బెయిల్ కోసం తొలుత సెషన్స్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దీనిపై దాదాపు 45 నిమిషాల పాటు హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి.

Also Read:బెయిల్ పిటిషన్: రఘురామ కృష్ణమరాజుకు హైకోర్టు షాక్

సెషన్స్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేయాలని హైకోర్టు సూచించింది. రఘురామ కృష్ణమరాజు వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు. రఘురామకృష్ణమ రాజు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు కోవిడ్ వచ్చే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో కోవిడ్ నిబంధనల మేరకు రఘురామకృష్ణమ రాజును విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రస్తుత పరిస్థితిలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. 

గతంలో ఓ యూనివర్శిటీ వీసీ నేరుగా హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారు కాబట్టి హైకోర్టుకు వచ్చామని రఘురామకృష్ణమ రాజు న్యాయవాది చెప్పారు. కుట్రపూరితంగా సిఐడి కేసు నమోదు చేసిందని, ఆధారాలు లేకుండా ఓ ఎంపీని అరెస్టు చేయడం సరి కాదని రఘురామకృష్ణమ రాజు న్యాయవాది అన్నారు.