బెజవాడ కేంద్రంగా ఉత్తరాంధ్రలో ఎలుగుబంటి హరిబాబు భూకుంభకోణాలకు పాల్పడుతున్నట్లు సీఐడీ విచారణలో తేలింది. విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రిలో భూ దందాలు చేసినట్లుగా సీఐడీ అధికారులు తేల్చారు.

ప్రస్తుతం పరారీలో వున్నాడు హరిబాబు. దీంతో అతని కుటుంబంపై భూ దందా కేసు నమోదు చేసింది సీఐడీ. బెజవాడ గాంధీ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా హరిబాబు ఆగడాలను కొనసాగించినట్లు సీఐడీ విచారణలో వెలుగులోకి వచ్చింది.

వంగవీటి మోహనరంగా హత్య జరిగిన సమయంలో గాంధీనగర్‌లో ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అప్పట్లో కొందరు దుండగులు నిప్పంటించిన నేపథ్యంలో అన్ని రికార్డులు కూడా కాలి బూడిదయ్యాయి.

ఆ కాలిపోయిన కారణంగా గాంధీ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని హరిబాబు కొన్ని వీలునామాలను అతను సృష్టించినట్లుగా సీఐడీ విచారణలో గుర్తుచేశారు.

రాజమండ్రి నగరంలో సుమారు రూ.100 కోట్లు విలువ చేసే 15 ఎకరాలకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి అమ్మే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరంలలో విలువైన భూములకు నకిలీ పత్రాలను సృష్టించినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది.

రాజమండ్రిలో సరోజ అనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో తొలుత బాధితురాలిగా ఉన్న సరోజిని.. ఆళ్ల శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేసింది. అయితే ఆయన ఇదంతా తనకు తెలియకుండానే జరిగిందని సీఐడీ, ఏపీ సీఎం తదితరులకు తెలియజేశారు. దీనికి సంబంధించి సీఐడీ ఛార్జీషీటు నమోదు చేసింది.