చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబును ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబును ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇక, సీఐడీ కస్టడీ పిటిషన్‌పై రేపు చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత కోర్టులో విచారణ అనంతరం.. న్యాయమూర్తి సీఐడీ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలాఉంటే, చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌కు సంబంధించి ఏసీబీ కోర్టు ఈరోజు సాయంత్రం తీర్పును వెలువరించనుంది.
ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబును విజయవాడకు తరలించి ఆదివారం తెల్లవారుజామున విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ చంద్రబాబు రిమాండ్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. అయితే చివరకు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇదిలాఉంంటే, ఈ కేసులో చంద్రబాబును విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును విచారించేందుకు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సోమవారం సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.