ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ది పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఆలస్యంపై దాఖలయిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఎస్ సమీర్ శర్మ కోర్టుకు హాజరయ్యారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ది పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు తమకు వైసిపి ప్రభుత్వం నుండి రావాల్సి బిల్లుల కోసం హైకోర్టు (ap high court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం అధికారుల నుండి సరయిన సమాధానం రాకపోవడంతో సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే గత విచారణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా కోర్టుకు హాజరయి బిల్లుల చెల్లింపులో జాప్యంపై వివరణ ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇవాళ(మంగళవారం) సీఎస్ సమీర్ శర్మ (cs sameer sharma) హైకోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పనులు చేయించుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే ఎలా? అని సిఎస్ ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే ప్రాధాన్యతా క్రమంలో బిల్లులు చెల్లిస్తున్నామని హైకోర్టుకు సిఎస్ సమీర్ శర్మ తెలిపారు. అందువల్లే కొందరు కాంట్రాక్టర్లకు కాస్త ఆలస్యంగా బిల్లులు చెల్లించాల్సి వస్తోందని సీఎస్ కోర్టుకు వివరించారు.
పనులు చేయించుకొని బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇలా సొంతం ఖర్చులతో పనులు చేసి సమయానికి ప్రభుత్వం నుండి బిల్లులు రాక కాంట్రాక్టర్ల కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి వచ్చిందని హైకోర్టుకు న్యాయవాది పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే బిల్లులు చెల్లింపులో ఎందుకు ఆలస్యం అవుతుందని సిఎస్ ను ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అంటున్నారని... ఇలాగయితే భవిష్యత్ లో ప్రభుత్వ పనులు చేసేందుకు ఎవరు ముందుకు వస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుకు 9వ ప్రాధాన్యత ఇస్తే ఎలాగని ధర్మాసనం సీఎస్ ను నిలదీసింది.
ఇకపై కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టవద్దని... సకాలంలో బిల్లులు చెల్లించేలా అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వాలని సీఎస్ సమీర్ శర్మకు హైకోర్టు ఆదేశించింది. లేదంటే తామే ఆదేశాలివ్వాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది.
ఇదిలావుంటే అభివృద్ది పనులు చేపట్టే కాంట్రాక్టర్లను వేధించమేంటని టిడిపి అధినేత చంద్రబాబు నాయడు కూడా ఇటీవల వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అభివృద్ధికి సహకరించిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గమని అన్నారు. న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధిహామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు? గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తేదారులపై కక్ష సాధింపులా? అంటూ వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు.
''జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు, అభివృద్ధి పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రావడంలేదు. చివరకు న్యాయస్థానాలు సైతం ఉపాధి పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని ఎన్నిసార్లు ఆదేశించినా ప్రభుత్వం లెక్కలేనితనంగా వ్యవహరిస్తోంది'' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.
''ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. రంజిత్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇటీవల అనంతపురం జిల్లాలో వికలాంగ గుత్తేదారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు'' అని చంద్రబాబు ఆవేదక వ్యక్తం చేసారు.
''ఉపాధి నిధులతో గ్రామాల అభివృద్ధికి పాటుపడిన వారికి బిల్లులు చెల్లించకుండా వేధిస్తారా.? గ్రామాల అభివృద్ధికి కృషిచేసిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. వారిని ఆర్థికంగా అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం'' అని చంద్రబాబు మండిపడ్డారు.
